Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు మొదలైన ‘‘కొత్త’’ మంట

By:  Tupaki Desk   |   23 March 2016 5:15 AM GMT
కేసీఆర్ కు మొదలైన ‘‘కొత్త’’ మంట
X
అధికార పక్షంలో ఉన్న వారిపై కత్తులు నూరేందుకు విపక్షాలు కాచుకొని ఉంటాయి. చిన్న పొరపాటు జరిగినా ఆ విషయాన్ని చీల్చి చెండాడేందుకు వారు అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. తనదైన శైలిలో దూసుకుపోతున్న కేసీఆర్ సర్కారు స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్న తెలంగాణ విపక్షాలు మంచి ఇష్యూ ఏదైనా బయటకురాదా? అన్నట్లుగా ఉంది. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తింటున్న విపక్షాలు.. తెలంగాణ అధికారపక్ష ఇమేజ్ ను డ్యామేజ్ చేసే అద్భుత అవకాశం కోసం ఎదురుచూస్తోంది.

తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ సర్కారు మీద పలు అంశాల మీద విమర్శలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. గడిచిన రెండు రోజులుగా ఒక విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు తెలంగాణ సర్కారు.. కొత్త భవనాల నిర్మాణం విషయంపై ఉత్సాహంగా ఉందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సచివాలయం.. సీఎం కార్యాలయాలు కొత్తవి అవసరమా? అని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ వాదనను వినిపించారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఓపక్క తెలంగాణ రైతుల పరిస్థితి దయనీయంగా దని.. ఇలాంటి సమయంలో రైతుల్ని ఆదుకోవాల్సిన సర్కారు.. కొత్త భవనాల నిర్మాణంపై ఆసక్తి చూపించటం ఏమిటంటూ ఆయన మండిపడుతున్నారు.

ఇదే వాదనను రెండు రోజుల క్రితం షబ్బీర్ అలీ కూడా ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో సమస్యలు చాలానే ఉంటే.. వాటి పరిష్కారం కంటే.. కొత్త భవనాల నిర్మాణంపై ప్రభుత్వం శ్రద్ధ చూపించటం.. నిధుల్ని దుబారా చేస్తుందన్న వాదనను బలంగా వినిపించే పనిలో భాగమే తాజా విమర్శలుగా చెబుతున్నారు. ఏది ఏమైనా కొత్త భవనాల నిర్మాణం విషయంలో కేసీఆర్ సర్కారు ఆచితూచి అడుగులు వేస్తే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది.