Begin typing your search above and press return to search.

అసమ్మతి సెగలు..కేసీఆర్ చెప్పినా వినడం లేదే.?

By:  Tupaki Desk   |   22 Sept 2018 4:38 PM IST
అసమ్మతి సెగలు..కేసీఆర్ చెప్పినా వినడం లేదే.?
X
టీఆర్ ఎస్ లో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. ఎంత బుజ్జగిద్దామని చెబుతున్నా నేతలు వినడం లేదట.. కేటీఆర్ - హరీష్ అదే పనిలో ఉన్నా కూడా 5 ఏళ్లకు ఒకసారి వచ్చే అధికార యోగాన్ని వదలుకోవడానికి ఏ నాయకుడు ఇష్టపడడం లేదట. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగినా కూడా పరిస్థితిలో మార్పు రావడం లేదని తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు రోజునే ఏకంగా 105మంది అభ్యర్థులను ప్రకటించేశారు. అప్పటి నుంచి అసమ్మతి సెగ రాజుకుంది. పలువురు టీఆర్ ఎస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోగా ఇప్పుడు మంత్రుల మద్దతుదారులు సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. ప్రకటించి రెండు వారాలు గడిచినా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలంటూ ఆందోళనలు ఆగకపోవడంతో టీఆర్ ఎస్ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఎవ్వరూ చెప్పినా అసమ్మతి వాదులు వినే పరిస్థితి లేకపోవడంతో ఆయా స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నట్టు సమాచారం.

కాగా కేసీఆర్ నిమజ్జనం అయ్యేలోపు ఖచ్చితంగా అసమ్మతి వాదులను బుజ్జగించి ఆశీర్వాద సభలతో ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల నేతల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయట.. చెన్నూరులో అభ్యర్థి బాల్క సుమన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన తాజామాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును కేసీఆర్ బుజ్జగించి శాంతపరిచారు. కానీ ఓదెలు కోసం ఆత్మహత్య చేసుకున్నకార్యకర్త మరణంతో ఇప్పుడు బాల్క సుమన్ పై చెన్నూర్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట.. ఇది అతడి ఓటమికి దారితీస్తుందేమోన్న టెన్షన్ టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోందట..

ఇక మహబూబాబాద్ - వేములవాడ - వైరా - ముథోల్ - జూబ్లీహిల్స్ - కూకట్ పల్లి - భువనగిరి - నాగార్జునాసాగర్ - మక్తల్ - రామగుండం నియోజకవర్గాల్లో అభ్యర్థిని మార్చాలంటూ పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు. ఓడిస్తామని శపథం చేస్తున్నారు. తెలంగాణ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ రెబల్స్ బరిలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే టీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలు క్లిష్టంగా మారుతాయి. ఇక స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్యకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బల ప్రదర్శన చేస్తున్నారు. మునుగోడులో అభ్యర్థి ప్రభాకర్ రావును ఓడిస్తామని అసమ్మతి వాదులు ఏకంగా భారీ సభ పెట్టేశారు.

ఇలా టీఆర్ ఎస్ లో చల్లారని అసమ్మతి సెగలు ఆ పార్టీ పుట్టిముంచేలా కనిపిస్తున్నాయి. అభ్యర్థులను మార్చాలంటూ టీఆర్ ఎస్ శ్రేణులే రోడ్డెక్కుతున్నారు. ఈ పరిణామాలు టీఆర్ ఎస్ గెలుపును ప్రభావితం చేస్తాయని అధిష్టానం ఆందోళనగా ఉందట..