Begin typing your search above and press return to search.

జగన్ చేసింది మరోసారి చేయలేకపోయిన కేసీఆర్!

By:  Tupaki Desk   |   27 Nov 2019 10:37 AM GMT
జగన్ చేసింది మరోసారి చేయలేకపోయిన కేసీఆర్!
X
తరచూ తమది ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో ధనిక అన్న మాటను చాలా అరుదుగా మాత్రమే వాడుతున్నారు. సంపన్న రాష్ట్రంగా ఒకప్పుడు గొప్పలు చెప్పుకున్న ఆయన.. ఇప్పుడా విషయాన్ని ప్రస్తావించటానికి సైతం సుతారం ఇష్టపడటం లేదంటున్నారు. ఏదైనా వరాన్ని ప్రకటించాలంటే కడుపు నిండిపోయేలా వ్యవహరించే అలవాటున్న కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల ముందు చిన్నబోతున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పాలి. అయితే.. వారు అనుకున్నది ఒకటి అయినది మరొకటి అన్నట్లు మారింది. తనకు నచ్చని అంశం మీద ఆందోళనకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇవ్వటం తెలిసిందే.

ఆర్టీసీ ఎపిసోడ్ ను పక్కన పెడితే.. గడిచిన కొద్ది రోజులుగా దిగుబడి తగ్గిపోవటం ద్వారా పై మార్కెట్ల నుంచి రావాల్సినంతగా ఉల్లిపాయలు రాకపోవటంతో రాకెట్ వేగంతో ధరలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకూ కిలో యాభై ఉన్న ఉల్లి కాస్తా నేడు వందకు పైనే చేరుకున్నాయి. దీంతో నిత్యం వంటల్లో విరివిగా వాడే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాన్ని గుర్తించిన జగన్.. కొద్ది రోజుల క్రితమే ఉల్లికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయటమే కాదు.. ప్రతి ఒక్క ఇంటికి కేజీ ఉల్లిని కేవలం రూ.25కు మాత్రమే అందించేలా ఏర్పాట్లు చేశారు.

ఏపీలో ఉల్లిని కేజీ పాతిక చొప్పున ప్రజలకు అందిస్తుంటే.. ఉల్లి ధర ఘాటును ప్రజలకు తప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీరిగ్గా నిద్ర లేచింది. ఈ రోజు (బుధవారం) సాయంత్రం నుంచి ఒక్కో కుటుంబానికి కేజీ ఉల్లి చొప్పున పంపిణీ చేయనున్నారు. అది కూడా రూ.40 చొప్పున. ఏపీలో కేజీ పాతికకు ఉల్లి ఇస్తున్నప్పుడు.. పక్కనున్న రాష్ట్రమైన తెలంగాణలో కేజీకి రూ.15 చొప్పున అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ఏపీనే.. ప్రజలకు భారం కాకుండా ఉండే విషయంలో పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నప్పుడు.. సంపన్నరాష్ట్రమైన తెలంగాణలో మాత్రం భారీ ధరలకు ఉల్లిని సరఫరా చేయటం ఏమిటి? ప్రశ్నిస్తున్నారు. ఇదేంది సారు.. ఈ వాయింపు?