Begin typing your search above and press return to search.

కేసీఆర్ తిరుమల టూర్ లో కొత్త కోణం?

By:  Tupaki Desk   |   21 Feb 2017 4:35 AM GMT
కేసీఆర్ తిరుమల టూర్ లో కొత్త కోణం?
X
తెలంగాణ రాష్ట్రం వస్తే.. స్వామివారికి భారీ సాలగ్రామ హారం.. ఐదు పేటల కంఠాభరణాన్ని మొక్కుగా చెల్లించుకుంటామని మొక్కిన మొక్కును శ్రీవారు తీర్చటం ఒక ఎత్తు అయితే.. ఆ మొక్కును దాదాపు మూడేళ్లకు దగ్గర పడుతున్న వేళ.. తిరుమలకు వచ్చి తన మొక్కును తీర్చుకుంటున్నారు కేసీఆర్. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు మొక్కిన మొక్కు ఏడేళ్ల తర్వాత తీరనుంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తిరుమలలో కేసీఆర్ అడుగుపెట్టటం ఇదే తొలిసారి.

ఇప్పటికే కేసీఆర్ తిరుమల పర్యటన మీద భారీగా కసరత్తు జరిగిన సంగతి తెలిసిందే. మీడియాలోనే పెద్ద ఎత్తున కవరేజ్ ఇస్తున్నారు . ఇదంతా ఒకటైతే.. తాజాగా కేసీఆర్ తిరుమల ట్రిప్ మీద ఆసక్తికర చర్చ సాగుతోంది. సీఎంగా పదవిని చేపట్టిన తర్వాత మొక్కు చెల్లించటానికి ఇన్నాళ్లు పట్టిందేనన్న మాటను కొందరు వ్యక్తం చేస్తుంటే.. ఇప్పటికైనా వెళుతున్నారు అదే గొప్ప అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకొందరు చెబుతున్న వాదన ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

తిరుమలకు వెళ్లాలని పలుమార్లు అనుకున్నప్పుడు ఏదో ఒక అడ్డంకి ఎదురయ్యేదని.. కానీ ఈసారి ఎలాంటి అడ్డంకి లేకపోవటానికి కారణం లేకపోలేదని చెబుతున్నారు. తిరుమల పుష్పగిరిమఠంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంట వివాహం జరుగనుంది. దీనికి కూడా కేసీఆర్ హాజరు కానున్నారు. ఇదంతా చూసినప్పుడు.. తనకెంతో సన్నిహితుడైన సుదర్శన్ రెడ్డి వివాహానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిన నేపథ్యంలో.. తన మొక్కు తీర్చుకోవటం.. స్వామి వారి దర్శనంతో పాటు.. తన సన్నిహితుడి ఇంట జరుగుతున్న పెళ్లికి హాజరు కావొచ్చన్న ఆలోచనతోనే ఈసారి తిరుమల ప్రోగ్రాం పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఎప్పుడూ లేని విధంగా తిరుమల ప్రయాణానికి కేసీఆర్.. కుటుంబ సభ్యులతో పాటు.. పలువురు మంత్రులు.. నేతలు కలిసి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఇందుకోసం రెండు ప్రత్యేక విమానాల్లో వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఎందుకిలా అన్నది ఆరా తీస్తే.. తిరుమల పర్యటనకు ఇంత భారీగా వెళ్లటానికి కారణం.. కేసీఆర్ కు సన్నిహితుడైన పెద్ది వారింట జరుగుతున్న పెళ్లిగా చెబుతున్నారు. ఇంతకూ.. తిరుమలకు కేసీఆర్ వెళుతున్నది పెళ్లి కోసమా? మొక్కు తీర్చుకోవటానికా అన్న మాట కంటే.. రెండూ కలిసి వస్తాయని అనుకుంటే సరిపోతుందేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/