Begin typing your search above and press return to search.

కేసీఆర్ ట్రిప్ 3 రోజుల ముందే ఎందుకు ముగిసిన‌ట్లు?

By:  Tupaki Desk   |   11 May 2019 5:06 AM GMT
కేసీఆర్ ట్రిప్ 3 రోజుల ముందే ఎందుకు ముగిసిన‌ట్లు?
X
ఒక ముఖ్య‌మంత్రి ప్ర‌యాణ షెడ్యూల్ ఎంత ప‌క్కాగా త‌యారు చేస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజా ట్రిప్.. షెడ్యూల్ కు భిన్నంగా మూడు రోజుల ముందే ముగిసిపోవ‌టం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఆయ‌న ప్ర‌యాణానికి ముందే.. ఏ రోజున ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యం మీద క్లారిటీ ఉంది. ఇప్ప‌టికిప్పుడు.. అనూహ్యంగా మారిన ప‌రిణామాలు అన్న‌వి ఏమీ లేవు. అలాంట‌ప్పుడు కేసీఆర్ టూర్ ప్లాన్ ఛేంజ్ కావాల్సిన అవ‌స‌రం ఏమిటి? అన్న‌ది క్వ‌శ్చ‌న్ గా మారింది.

కేర‌ళ‌తో త‌న టూర్ ను స్టార్ట్ చేసిన కేసీఆర్‌.. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 13 వ‌ర‌కూ ట్రిప్ లోనే ఉండాలి. అందుకు భిన్నంగా శుక్ర‌వారం ఆయ‌న త‌న ట్రిప్ కు పుల్ స్టాప్ పెట్టేసి.. మూడు రోజుల ముందే హైద‌రాబాద్ కు వ‌చ్చేశారు. త‌మిళ‌నాడులో అడుగు పెట్టిన నాటి నుంచి గుళ్ల మీద గుళ్ల‌ను సంద‌ర్శిస్తున్న కేసీఆర్ అండ్ ఫ్యామిలీ శుక్ర‌వారం కూడా అదే ప్రోగ్రాంను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు.

క‌న్యాకుమారి నుంచి రామేశ్వ‌రానికి వ‌చ్చిన ఆయ‌న‌.. అక్క‌డి ప్ర‌సిద్ధ రామ‌లింగేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకున్నారు. గురువారం నుంచి రామేశ్వ‌రంలోనే ఉన్న ఆయ‌న‌.. గుడితో పాటు.. మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లాం స‌మాధి వ‌ద్ద అంజ‌లి ఘ‌టించారు. త‌ర్వాత అక్క‌డే ఉండిపోయిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు ధ‌నుష్కోటి బీచ్ ను కూడా సంద‌ర్శించారు.

ఈ బీచ్ కు పురాణాల్లో ఉన్న ప్ర‌త్యేక‌త తెలిసిందే. పురాణాల ప్ర‌కారం శ్రీ‌రాముడు ఇక్క‌డ నుంచే రామ‌సేతు నిర్మాణం మొద‌లెట్టార‌ని చెబుతారు. దీన్నే ఆడ‌మ్స్ బ్రిడ్జ్ గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అనంత‌రం త‌మిళ‌నాడులోని మ‌ధుర మీనాక్షి ఆల‌యాన్ని సంద‌ర్శించిన కేసీఆర్ ఫ్యామిలీ అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌ర్తించారు.

కేసీఆర్ తో పాటు.. ఆయ‌న స‌తీమ‌ణి.. కుమారుడు.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు.. రాజ్య‌స‌భ స‌భ్యుడు.. కుటుంబ స‌భ్యుడైన సంతోష్ కూడా వారి వెంటే ఉన్నారు. మూడు గుళ్లు.. ఆరు పూజ‌లు అన్న‌ట్లుగా సాగుతున్న కేసీఆర్ టూర్ మూడు రోజుల ముందే ముగియ‌టం ఎందుక‌న్న విష‌యంపై క్లారిటీ రాని ప‌రిస్థితి.

షెడ్యూల్ లో అనుకున్న‌ట్లుగా డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ 13న ఉండి ఉంటే.. టూర్ కొన‌సాగేది. కేసీఆర్ తో భేటీకి స్టాలిన్ ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌టంతో షెడ్యూల్ లో మార్పు చోటు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. అలా చెబితే బాగోదు కాబ‌ట్టి.. మూడు జిల్లాల్లో స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌టం.. ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నిక‌లు ముగియ‌నున్న నేప‌థ్యంలో మూడు రోజులు ముందే హైద‌రాబాద్ కు చేరుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇవ‌న్నీ ఇప్పుడు జ‌రుగుతాయ‌ని కేసీఆర్ తెలీకుండానే ట్రిప్ పెట్టుకున్నారా ఏంటి?