Begin typing your search above and press return to search.

సెటిలర్లకు కేసీఆర్ భారీ గిఫ్ట్

By:  Tupaki Desk   |   11 Jan 2019 5:37 AM GMT
సెటిలర్లకు కేసీఆర్ భారీ గిఫ్ట్
X
ఎన్నికలంటే యుద్ధంలా భావించి శత్రువులను కకావికలం చేస్తున్న టీఆర్ ఎస్ పార్టీ మళ్లీ మొదలెట్టింది. ఎన్నికలు ముగిసి నెలరోజులు కాకుండానే పార్లమెంటు ఎన్నికలపై కసరత్తు షురూ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ ఎస్ అదే ఊపులో పార్లమెంట్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు లోక్ సభ ఎంపీ టికెట్ల ఖారారు పై కసరత్తు మొదలు పెట్టింది.

ఇప్పటికే సిట్టింగ్ లందరికీ ఎంపీ టికెట్లు ఖాయమని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. హైదరాబాద్ ఎంపీ సీటును ఇప్పటికే ఎంఐఎంకు వదిలేసిన టీఆర్ ఎస్ ఇప్పుడు హైదరాబాద్ శివారున ఉన్న సికింద్రాబాద్, మల్కాజ్ గిరి ఎంపీ సీట్ల పై ఫుల్ ఫోకస్ పెట్టింది. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. దీంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. అక్కడ మరో అభ్యర్థి కోసం టీఆర్ ఎస్ వేట ప్రారంభించింది.

సికింద్రాబాద్ లో గడిచిన సారి దత్తాత్రేయ బీజేపీ నుంచి గెలిచారు. ఆ సీటును కైవసం చేసుకోవడంతోపాటు మల్కాజిగిరి లోక్ సభను గెలిచేందుకు అక్కడ ఉన్న సెటిలర్లకు గాలం వేయాలని టీఆర్ ఎస్ స్కెచ్ గీసింది.. మల్కాజిగిరి, సికింద్రాబాద్ పరిధిలో సెటిలర్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి వారికే టికెట్ ఇవ్వాలని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

గడిచిన జీహెచ్ ఎంసీ ఎన్నికలు, ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు అంతా టీఆర్ ఎస్ కే పట్టం కట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు సెటిలర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ఎన్నికలు ఎత్తులు వేసినా.. బలమైన అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేసినా సెటిలర్లంతా గులాబీ పార్టీనే ఆదరించి గెలిపించారు. దీంతో సెటిలర్లంతా మనవైపే ఉన్నారని గ్రహించి గులాబీ బాస్ ఇప్పుడు వారికి అండగా ఉండేందుకే సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ సీట్లను సెటిలర్లతోనే భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సికింద్రాబద్ ను కమ్మ సామాజికవర్గానికి, మల్కాజిగిరిని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ సెటిలర్ల వడపోతను కేటీఆర్ కు అప్పగించినట్లు తెలిసింది.