Begin typing your search above and press return to search.

ఉప ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులు వీరేనా?

By:  Tupaki Desk   |   19 Oct 2015 4:48 AM GMT
ఉప ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులు వీరేనా?
X
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో బరిలోకి నిలపాల్సిన అభ్యర్థులకు సంబంధించిన కసరత్తును టీఆర్ ఎస్ పూర్తి చేసిందా? అన్నప్రశ్నకు అవుననే సమాధానం లభిస్తోంది. నారాయణ ఖేడ్ అసెంబ్లీ స్థానానికి.. వరంగల్ ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో అధికారపార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల్ని పార్టీ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి పెద్దపీట వేసి.. వారిని బరిలోకి దింపుతారని కొందరు చేస్తున్న వాదనలో పస లేదని తేలింది. అదే సమయంలో.. పార్టీ నేతలకు చెందిన కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తారన్న వాదన వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం భారీగా సాగింది. అయితే.. అలాంటిదేమీ లేకుండానే అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెబుతున్నారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో నారాయణ ఖేడ్ నుంచి పోటీ చేసిన ఓడిపోయిన భూపాల్ రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపాలని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయనపై కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ.. పార్టీ టిక్కెట్టు ఆయనకే ఇవ్వాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబతున్నారు.

ఇక.. వరంగల్ ఎంపీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో పర రవికుమార్ లేదంటే దయాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరు అభ్యర్థిగా మారటం ఖాయమని చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా టిక్కెట్టు ఆశావాహుల్లో ఉన్నారని.. ఆయన్ను బరిలోకి దింపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.