Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాటంటే మాటే..ఆ ముగ్గురికే రాజ్య‌స‌భ టికెట్‌

By:  Tupaki Desk   |   11 March 2018 1:58 PM GMT
కేసీఆర్ మాటంటే మాటే..ఆ ముగ్గురికే రాజ్య‌స‌భ టికెట్‌
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స‌స్పెన్స్‌కు తెర‌దించారు. త‌న అధ్య‌క్ష‌త‌న తెలంగాణ‌ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. రేపట్నుంచి ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు కూడా హాజరయ్యారు. త‌న కుటుంబ స‌భ్యుడు - టీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ తోపాటు బడుగుల లింగయ్య యాదవ్ - బండ ప్రకాశ్ ముదిరాజ్‌ లను రాజ్యసభకు పంపించాలని టీఆర్ఎస్ నిర్ణయించారు.అదే విధంగా రాజ్యసభ సభ్యులను పార్టీ సభ్యులకు సీఎం పరిచయం చేశారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి తేదీ కాగా, అదే రోజు అసెంబ్లీ కూడా ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో నామినేష‌న్ వేయాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

ఇటీవ‌లి కాలంలో రాజ్యసభకు తెలంగాణలోని 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు సీట్లలో సునాయాసంగా గెలుస్తామన్న నమ్మకంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఈ క్రమంలో మూడు వేర్వేరు సామాజిక వర్గాల అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఆలోచించారు. రాజ్యసభ బెర్తు కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు చేసుకున్నారు. చివరగా పేర్లన్నీ పరిశీలించిన సీఎం...ముగ్గురి ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉద్య‌మ‌కాలం నుంచి త‌న వెన్నంటి ఉన్న స‌న్నిహిత బంధువు సంతోష్ కుమార్‌ పేరు ఖరారు చేశారు. మరో స్థానాన్ని యాదవులకు ఇస్తామని ఇదివరకే సీఎం తెలిపారు. యాదవుల్లో ఈ సారి దక్షిణ తెలంగాణ నుంచి ఛాన్స్ ఇచ్చేందుకు ఓకే చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన లింగయ్య యాదవ్ టీడీపీలో బలమైన నేతగా ఎదిగారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరి కీలకంగా మారారు.

మూడో స్థానాన్ని ముదిరాజ్ వర్గానికి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన బండ ప్రకాశ్ ముదిరాజ్‌కు ఖ‌రారు చేశారు. మూడో స్థానం విష‌యంలోనే ఉత్కంఠ కొన‌సాగింది. హైదరాబాద్‌లోని మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖ విద్యాసంస్థల అధినేతతో పాటు మరికొందరు పేర్లను పరిశీలించారు. ముదిరాజ్ వర్గ నాయకుల వివరాలనూ పరిశీలించి ఈ ముగ్గురు పేర్ల‌ను ఖ‌రారు చేశారు.