Begin typing your search above and press return to search.

కేంద్రమే చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా:కేసీఆర్

By:  Tupaki Desk   |   1 Sep 2020 4:00 PM GMT
కేంద్రమే చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా:కేసీఆర్
X
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారరం తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. చట్ట ప్రకారం రాష్ట్రాలకు చెల్లించవలసిన జీఎస్టీ పరిహారం రూ.3 లక్షల కోట్లకు గాను..సెస్ తగ్గించి ఒక లక్షా 65 వేల కోట్లకి కుదించడంపై రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్టీ చట్టంలో14 శాతం వృద్ధి రేటు ప్రకారం రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. యాక్ట్ ఆఫ్ గాడ్, కరోనా పేర్లతో రూ.1.35 లక్షల కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వకుండా కేంద్రం ఎగ్గొట్టాలని చూస్తోందని తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలతో పాటు పలు విషయాలను కేసీఆర్ ప్రస్తావించారు. జీఎస్టీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం తగ్గింపు నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని, చట్ట ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మొత్తం రూ.3 లక్షల కోట్లు చెల్లించాల్సిందేనని కేసీఆర్ డిమాండ్ చేశారు.

రాష్ట్రాలకు పూర్తిగా పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవాలని కేసీఆర్ కోరారు. చట్ట ప్రకారం 14 శాతం వృద్ధి రేటు ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే.. కేంద్రమే దాన్ని భర్తీ చేయాలని గుర్తు చేశారు. గతంలో యూపీఏ సర్కార్ కూడా రాష్ట్రాలను ఇదే విధంగా మోసం చేసిందని, ఎన్డీయే కూడా అలా చేస్తుందేమోనని గతంలోనే జీఎస్టీని ప్రశ్నించామని గుర్తు చేశారు. అయితే, దేశ ప్రయోజనాల కోసం జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపామని, కానీ, తాము అనుకున్నట్లే జీఎస్టీ పరిహారం చెల్లింపుల్లో కోత విధిస్తున్నారని కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనాతో ఏప్రిల్ లో ప్రభుత్వం 83 శాతం రాబడిని కోల్పోగా, కరోనా కట్టడి కోసం అదనంగా ఖర్చు చేశామని కేసీఆర్ అన్నారు.

రాష్ట్రాల ఒత్తిడి ప్రకారమే రెవెన్యూ నష్టాన్ని పూడ్చడానికి ప్రతి 2 నెలలకోసారి పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లించాలని చట్టంలో ఉందని, అయినా కూడా పరిహారం చెల్లింపుల్లో జాప్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందలేదని, కరోనాతో ఆదాయం తగ్గి...ఖర్చులు పెరిగాయని... వేతనాలు, ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలంటూ కేంద్రం సూచించడం సరికాదని, కేంద్రానికి ఉన్న ఆర్థిక వెసులుబాటు రాష్ట్రాలకు లేదని గుర్తు చేశారు. కరోనా విపత్తు వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు అదనంగా సాయం చేయాల్సిన కేంద్రం ఈ విధంగా కోత విధించడం తగదన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థ, విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉన్నందున రాష్ట్రాలు విధిగా కేంద్రంపై ఆధారపడే పరిస్థితులున్నాయని అన్నారు. మార్కెట్ బారోయింగ్‌లకు కూడా కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోందని, ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్ధమని కేసీఆర్ అన్నారు. ఏది ఏమైనా...నిన్న అల్లుడు...నేడు మామ...ఇద్దరూ కేంద్రాన్ని కడిగిపారేశారని అంతా అనుకుంటున్నారు.