Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కోపం; సన్నాసి.. కుక్క.. ముండమోపి..!

By:  Tupaki Desk   |   12 Jun 2015 4:33 AM GMT
కేసీఆర్‌ కోపం; సన్నాసి.. కుక్క.. ముండమోపి..!
X
కోపం వస్తే నోరు జారటం మామూలే. సాదాసీదా వ్యక్తులందరూ తరచూ చేసే పనే ఇది. కానీ.. కోట్లాదిమంది ఆశలు.. ఆకాంక్షలు తీర్చాల్సిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నోరు జారటం మంచిదేనా? కొన్ని అంశాల్లో అభిప్రాయభేదాలు ఉండటం.. విరుద్ధ వాదనలు చేసుకోవటం మామూలే. అంతమాత్రం చేతనే ఇష్టం వచ్చినట్లు తూలనాడటం సరైనదేనా? అంతరాష్ట్ర జలవివాదాల విషయంలో ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తారు. ఇలాంటి వివాదం ఏదైనా పరిష్కరించుకోవటానికి ఎన్నో మార్గాలున్నాయి.

అలాంటి వాటిని వినియోగించుకోవటం కంటే కూడా.. తన నోటితో విరుచుకుపడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టపడుతున్నారు. రూ.35,250కోట్లతో నిర్మిస్తున్న పాలమూరు - రంగారెడ్డి నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేసీఆర్‌.. ఏపీ సర్కారును.. సీమాంధ్రులను తీవ్రస్థాయిలో తిట్టిపోశారు.

హరిహరాదులు అడ్డుపట్టినా తాను ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తానని.. మూతి మీద తన్ని మరి.. ప్రాజెక్టును కూర్చీ వేసుకొని కూర్చొని మరీ పూర్తి చేస్తానని వ్యాఖ్యానించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సన్నాసి.. కుక్క.. ముండమోపి లాంటి మాటల్ని చాలానే వాడారు.

''రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా ఈ ఆంధ్రోళ్ల పీడ ఇంకా విరగడవుతలేదు. రాష్ట్రం ఏర్పాటై ఏడాదాయే. కాలికి పెడితే మెడకు.. మెడకు పెడితే కాఉకు పెడుతున్నరు. ఒకడు కష్టపడి పిల్లను చూసి పెళ్లి చేసుకుంటున్నడట. ఇంతలో ఒకడొచ్చి పోలు పోసేటప్పుడు ముక్కులో కర్ర పెట్టుకొని తుమ్ముతున్నడట అన్నట్లుంది పరిస్థితి. ఇక్కడ శుభమా అని చెప్పి ఓ మంచి ప్రాజెక్టుకు శ్రీకారం.. శంకుస్థాపన చేసుకుంటుంటే.. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రోద్బలంతో అక్కడి సాగునీటి మంత్రి మాట్లాడుతున్నడు. పాలమూరు ఎత్తిపోతలకు అనుమతులు లేవు. ఏడికెళ్లి కడతవ్‌ కేసీఆర్‌.. అంటున్నడు. నీ అబ్బ జాగీరా కృష్ణానది? సమైక్యపాలనలో మీ ఇష్టం వచ్చినట్లు కట్టిన దొడ్డిదారి ప్రాఎక్టులు హంద్రీనీవా.. పోతిరెడ్డిపాడు.. కండలేరు.. సోమశిల.. వెలిగొండకు అనుమతులు ఉన్నాయా? ఎవరి అబ్బ జాగీరని కట్టినవ్‌? ఇవ్వాల పట్టిసీమ ప్రాజెక్టు మొదలు పెట్టినవ్‌. పోలవరం నుంచి కృష్ణాకు నీటిని తరలించేందుకు ఎవరిని అడిగి మొదలు పెట్టినవు? ఇవ్వాల నన్ను అడిగే అధికారం నీకెక్కడిది? ఊ అంటే ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తవు. ఆయన నీకే కాదు. మాకు కూడా ప్రధానమంత్రే. ఆయన నీలాంటి వారి మాట విని పాలమూరు ప్రజలకు నీళ్లు వద్దంటరా? హరిహర బ్రహ్మాదులు అడ్డువచ్చినా.. కోటి చంద్రబాబులు కొంగజపం చేసినవా పాలమూరు కట్టి చూపిస్తాం'' అని విరుచుకుపడ్డారు.

తాను తెలంగాణ ఉద్యమంలో ఆర్డీఎస్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు కర్నూలులో బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఓ మాట అన్నడంటూ.. ''కేసీఆర్‌ది బ్లాక్‌మెయిల్‌ యాత్ర అని చెప్పిండు. కేసీఆర్‌ ఆర్డీఎస్‌ తూములు బందు పెడితే బాంబులతో పేల్చేస్తామన్నాడు. నేను చెప్పిన నీ సుంకేసులకు వెయ్యి బాంబులు పెట్టి దుమ్మురేపుతా అన్న. ఆవేశంతో మాట్లాడిన కదా.. సరైనదేనా అని ఆ తర్వాత విలేకరులను అడిగి తెలుసుకున్న. పాలమూరు పరిస్థితికి అది సరైందేనని జిల్లా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. అలాంటి పాలమూరులో నేటివరకు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తయిందా? ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో తొమ్మిదేళ్లు జిల్లాను దత్తత తీసుకున్నాడు. తొమ్మిది అడుగులు అయినా ఒక్క ప్రాజెక్టు ముందుకు పడిందా? ఆర్డీఎస్‌ను ఆగంబట్టించిండు. 85వేల ఎకరాల పారిన ప్రాజెక్టు ఇవ్వాల ఎన్ని ఎకరాలు పాడుతుందో తెలుసా. ఇవ్వాల మళ్లీ బాంబుల పురాణమే మొదలుపెట్టిండు. బిడ్డా.. కేసీఆర్‌ ఆటంబాంబు. త్వరలోనే కర్ణాటక పోయిఅక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడతా. మళ్లీ ఆర్డీఎస్‌ కట్ట కాన్నే కుర్చీ వేసుకొని ప్రాజెక్టు కట్టిస్తా. చంద్రబాబు.. దేవినేని మైండిట్‌! మీ ఆటలు ఇక చెల్లవ్‌. ఇది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడి ప్రజలు ఏది కోరుకుంటరో అదే న్యాయంగా సాధించుకుంటాం'' అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం తాను ఉద్యమిస్తే.. నిందలు వేసి తనను గేలి చేశారంటూ గుర్తు చేసుకున్న కేసీఆర్‌ ఈ సందర్భంగా మాటలతో చెలరేగిపోయారు. ''ఎవరు తెలంగాణను వ్యతిరేకించారో వారే నేడు తెలంగాణను వదిలి పెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది. మాకు వనరులు.. వసతులు ఉన్నయ్‌. ఇన్నాళ్లు మా సొమ్ము దొబ్బితిన్నరు. ఇప్పుడు మా డబ్బు మేమే తింటున్నం. మీరెన్ని కుట్రలు చేసినా మా బిడ్డలు.. వృద్ధులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం'' అని తాము అమలు చేస్తున్న పథకాల గురించి చెప్పుకొచ్చారు.

ఉమ్మడిగా ఉన్న కాలంలో.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న కేసీఆర్‌..''వచ్చే మార్చి నుంచి ఉదయం నుంచే నాణ్యమైన విద్యుత్తు ఇస్తాం. కోతల్లేని కరెంటు ఇస్తాం. రాత్రిళ్లు పొలాల్లోకి వెళ్లి పాముకాటు లాంటి వాటికి గురి కావాల్సిన అవసరం లేదు. విభజన నాడు కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కట్టె పట్టి చెప్పిండు.. తెలంగాణ వస్తే చిమ్మచీకటి అవుతది.. బతుకు ఆగమవుతది అన్నడు. అయిందా? చంద్రబాబు కేంద్ర చట్టాన్ని ఉల్లంఘించి మనకు రావాల్సిన కరెంటు ఇవ్వలేదు. ఆహోరాత్రులు మేం కష్టపడి ఎవరి మద్ధతు లేకుండా మన కరెంటు మనమే తేచ్చుకుంటున్నం. కేసీఆర్‌ బతికి ఉన్నంత కాలం కరెంటు ఇస్తాం. రెప్పపాటు కూడా కరెంటు చూస్తాం'' అని అన్నారు. కరెంటు గురించి మాట్లాడే సందర్భంలో ఇవ్వాల కరెంటు పోయిందా? అని సభికుల్ని స్పందన కోరారు. వారు పోలేదని బదులిచ్చారు.