Begin typing your search above and press return to search.

‘ఆంధ్రోళ్లు’ అంటూ మరోసారి కేసీఆర్ ఫైర్

By:  Tupaki Desk   |   12 Aug 2016 7:07 AM GMT
‘ఆంధ్రోళ్లు’ అంటూ మరోసారి కేసీఆర్ ఫైర్
X
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ నేతగా వ్యవహరించిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాటలు ఎంత వాడిగా.. వేడిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ సంస్కృతిని.. సంప్రదాయాల్ని.. భాషను.. యాసను ఆంద్రా పాలకులు దారుణంగా దెబ్బ తీశారని.. తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని.. వారి కారణంగానే తెలంగాణ తీవ్రంగా అన్యాయానికి గురైందని చెప్పటమే కాదు.. తన వాదనకు తగ్గట్లే రాష్ట్ర విభజనలో ప్రధాన భూమిక పోషించారు.

విభజన జరిగి రెండేళ్లు అయి.. ఎవరి దారిన వారు బతుకుతున్న వేళ.. తాజాగా కృష్ణా పుష్కరాల ప్రారంభం నేపథ్యంలో ‘ఆంధ్రా పాలకుల’ పేరిట ఆయన మరోసారి తీవ్రంగా విమర్శించారు.కృష్ణా పుష్కరాలంటే విజయవాడ అని.. గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి అని ప్రచారం చేసుకున్నారని.. తెలంగాణ ప్రాంతంలోని ఆలయాలు.. గుడులు.. నదీ పరివాహ ప్రాంతాల్ని ఆంధ్రాపాలకులు విస్మరించారంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు.

ఈ తెల్లవారు జామున గొందిమళ్ల వద్ద కేసీఆర్ పుష్కర స్నానం చేశారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ లోని జోగులాంబ దేవాలయాన్ని సందర్శించిన ఆయన అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఆంధ్రా పాలకుల పేరిట ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గోదావరి పుష్కరాల సందర్భంగా ఎన్నో కొత్త ఘాట్లను నిర్మించిన విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్.. అదే రీతిలో కృష్ణా పుష్కరాల సందర్భంగా కొత్త ఘాట్లను ఏర్పాటు చేశామన్నారు. అలంపూర్ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన ఆయన.. ఆ ప్రాంతంపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణ ఉద్యమంలో తరచూ వినిపించిన ‘విడిపోయి కలిసి ఉందాం’ అన్న నినాదాన్ని చూస్తే.. విడిపోయిన తర్వాత ఎవరి బాధలు వారు పడుతున్న వేళ.. మళ్లీ మళ్లీ ఆంధ్రా పాలకులంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.