Begin typing your search above and press return to search.

కేంద్రంపై శివాలెత్తిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   16 March 2015 3:49 PM GMT
కేంద్రంపై శివాలెత్తిన కేసీఆర్‌
X
దాదాపుగా రెండు మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం ఉమ్మడిగా మండిపడ్డారు. పనిలో పనిగా, యథావిధిగా చంద్రబాబుపై సైతం నిప్పులు చెరిగారు. పార్టీ శాసనసభా పక్షం సమావేశం ముగిసిన అనంతరం సోమవారం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టుకు నీటిని తరలించుకుపోయే విషయంలో తాము ఫిర్యాదు చేసిన కేంద్ర సర్కారు పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర హైకోర్టు విభజన చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, న్యాయశాఖమంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా అవేమీ పట్టించుకోకపోవడంతో తెలంగాణ లాయర్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి తెలంగాణ అభ్యంతరాలను, అవసరాలను కేంద్రం ఏ విషయంలోనూ పట్టించుకోవడం లేదని కేసీఆర్‌ ఆరోపించారు. విభజన హక్కులు, నిధులు, హైకోర్టు విభజన తదితర అంశాల్లో అన్యాయం జరుగుతోందని మొత్తుకున్నా వినడం లేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ, బీజేపీ అభ్యర్థులను ఓడించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వారు గెలిచనా ఒరిగేదేమీ లేదన్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్సీల వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఢిల్లీ ఫలితాలే పునరావృత్తం అవుతాయని జోస్యం చెప్పారు.పనిలో పనిగా తమ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం ఖరారు అయిపోయిందని కూడా ప్రకటించారు. తమ పార్టీ సభ్యత్వం 50లక్షలు దాటిందని చెప్పారు.

ఇన్నాళ్లు కేంద్రంపై ఉలుకు పలుకు లేని విధంగా ఉన్న కేసీఆర్‌ ఇపుడు హఠాత్తుగా నోరెందుకు ఎత్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా చేసుకోమన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించకపోవడమా లేదా... ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చే వ్యూహమా అనే చర్చ సాగుతోంది.