Begin typing your search above and press return to search.

కరోనా రోగి చెప్పిన మాట విని.. డాక్టర్ కు షాకిచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   22 May 2021 6:30 AM GMT
కరోనా రోగి చెప్పిన మాట విని.. డాక్టర్ కు షాకిచ్చిన కేసీఆర్
X
ఏం చేసినా సంపూర్ణంగా చేయాలనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఫాంహౌస్ కు పరిమితమైతే.. మరో ఆలోచన లేకుండా వారాల తరబడి అక్కడే ఉండిపోతారు. రివ్యూలు అంటూ మొదలు పెట్టారా.. నాన్ స్టాప్ గా గంటల కొద్దీ మారథాన్ రివ్యూల్ని నిర్వహిస్తుంటారు. ఒకసారి తిరగటం మొదలు పెడితే.. కూర్చొని ఉండటానికి అస్సలు ఇష్టపడరు. మొన్న గాంధీకి వెళ్లిన కేసీఆర్.. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా ఆయన కరోనా రోగులతో మాట్లాడారు.

ఆసుపత్రి సందర్శన అంటే.. మమ అన్నట్లుగా నలుగురైదుగురితో మాట్లాడి పూర్తి చేస్తారు.కరోనా వేళ.. కరోనాతో బాధ పడుతున్న రోగుల్ని నేరుగా పరామర్శిస్తున్న కేసీఆర్.. వారికి దగ్గరకు వెళ్లి మరీ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. కొందరురోగులు అంతా బాగుందని చెబుతున్నా... మరికొందరు మాత్రం నిష్ఠూరంగా ఉండే నిజాల్ని మొహమాటం లేకుండా చెప్పేయటం గమనార్హం.

ఇన్ని రోజుల నుంచి వార్డును శుభ్రం చేయలేదని.. మీరు వస్తున్నారని హడావుడిగా శుభ్రం చేశారని కొందరు చెబితే.. దొడ్డు బియ్యం పెడుతున్నారని.. డ్రైఫ్రూట్స్ పెట్టటం లేదని.. కూరలు బాగుండటం లేదని.. ఆక్సిజన్ ఫ్లో మీటర్ల కొరత గురించి కేసీఆర్ కు నేరుగా చెప్పేసినట్లుగా తెలుస్తోంది. తన వరకు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించిన కేసీఆర్.. అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఒక బాధితుడితో మాట్లాడిన సందర్భంలో తాను ఆసుపత్రిలో జాయిన్ అయి 12 రోజులు అవుతుందని.. ఇంకా తగ్గలేదని చెప్పారు.

కరోనా తగ్గిందో లేదో తెలుసుకోవటానికి మరోసారి పరీక్ష చేయలేదా? అని అని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ నను అడిగారు. ప్రస్తుత గైడ్ లైన్స్ ప్రకారం 12 రోజుల తర్వాతే పరీక్ష చేయటం లేదని చెప్పగా.. అలా అయితే ఎలా? రెండోసారి పరీక్ష చేయకపోతే.. వైరస్ పోయిందో లేదో ఎలా తెలుస్తుంది? మీరు తర్వాత నన్ను వచ్చి కలవండి.. మనం ఈ విషయంపై మాట్లాడదాం’ అంటూ షాకిచ్చారు. తన వరకు వచ్చిన విషయాల్ని.. సమస్యలపై స్పందించిన తీరుపై అక్కడి రోగులు ఆనందానికి గురైనట్లుగా చెబుతున్నారు. ఇక్కడితో ఆగకుండా మరో వారానికి మరోసారి ఎంజీఎంను పరిశీలిస్తే..మార్పులు ఏమేరకు వచ్చాయన్న విషయం తెలుస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ ఆ పని చేస్తారంటారా?