Begin typing your search above and press return to search.

జానారెడ్డి గుట్టు విప్పిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   18 Nov 2015 11:03 AM GMT
జానారెడ్డి గుట్టు విప్పిన కేసీఆర్‌
X
రాజ‌కీయ నాయ‌కులంద‌రూ పెద్ద పెద్ద ఉప‌న్యాసాలు ఇస్తారు.. కానీ ఉప‌న్యాసాలిచ్చేవారంతా రాజ‌కీయ నాయ‌కులు కాదు. నాయ‌కులు మాట్లాడుతుంటే.. వీడి ప్ర‌సంగం ఎప్పుడు అయిపోతుందా అని అనుకోకూడ‌దు. ప్ర‌సంగం చ‌ప్ప‌గా ఉండ‌కూడ‌దు. నాయ‌కుడి మాట‌లు విని ప్ర‌జ‌లు ఉత్తేజితుల‌వ్వాలి. ప్ర‌జ‌ల్లో నమ్మ‌కాన్ని కలిగిస్తేనే వాళ్లు నిజ‌మైన పొలిటీషీయ‌న్లు అవుతారు. ఇప్పుడున్న నాయ‌కుల్లో కేసీఆర్ ప్ర‌సంగాల‌కు ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ఎప్పుడూ బ‌హిరంగ స‌భల్లో ప్రస్తావించ‌కుండానే వారిపై విమ‌ర్శ‌లు చేయ‌గ‌ల దిట్ట ఆయ‌న‌.

ప్ర‌సంగం ఆవేశంగా చేస్తూనే మ‌ధ్య‌మ‌ధ్య‌లో చ‌మ‌త్కార బాణాలు విస‌ర‌గ‌ల నేర్ప‌రి. ప్ర‌తిప‌క్షాల నాయ‌కుల‌పై చ‌మ‌క్కులు - వ్యంగ్రాస్త్రాలు ఇవ‌న్నీ ఆయ‌న మాటల్లో ఉంటాయి. మంగ‌ళ‌వారం జ‌రిగిన వ‌రంగ‌ల్ బహిరంగ స‌భ‌లో ప్ర‌తిపక్ష నేత జానారెడ్డికి సంబంధించి ఓ గుట్టును ఆయ‌న రట్టు చేశారు. జానారెడ్డిపై ఓ టాక్ ఉంది. అసెంబ్లీ లోప‌ల‌ - బ‌య‌టా కూడా ఆయ‌న కేసీఆర్‌ ను విమ‌ర్శించే సాహ‌సం చేయ‌రు. అధికార ప‌క్షానికి జానా పూర్తిగా సరెండ‌ర్ అయిపోయార‌న్న విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న సొంత పార్టీ నేత‌ల నుంచే ఎదుర్కొంటున్నారు.

అయితే వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక వేడి మొద‌ల‌వ్వ‌గానే జానా కాస్త స్వ‌రం పెంచి కేసీఆర్‌ తో పాటు తెరాస‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికి కౌంట‌ర్‌ గా కేసీఆర్ కూడా జానారెడ్డిపై ప్ర‌తి విమ‌ర్శ‌లు చేశారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయ‌న‌ పాత చరిత్రను ప్రస్తావించి విమర్శలు గుప్పించారు.1992 లో జానారెడ్డి మంత్రి పదవి రాలేదని తెలంగాణ ఫోరం పెట్టారని,ఆ తర్వాత విజయభాస్కర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌గానే తెలంగాణ ఫోరం మూసివేశారని ఆయన విమ‌ర్శించారు.

జానారెడ్డి తనను కూడా ఫోరంలోకి రావాలని అప్పట్లో జానా రెడ్డి కోరినా తాను వెళ్లలేదని...కేవ‌లం మంత్రి ప‌ద‌వి కోసం తెలంగాణ పేరు వాడుకున్న చ‌రిత్ర జానారెడ్డిద‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. అప్పట్లో జానారెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల పేరుతో కొంత హడావుడి చేసి, ఆ తర్వాత మంత్రి అయ్యాక పట్టించుకోలేద‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. ఓవ‌రాల్‌గా జానారెడ్డికి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వి ఎలా వ‌చ్చిందో చ‌రిత్ర చెప్ప‌డంతో ఒక్క‌సారిగా స‌భికుల నుంచి కేసీఆర్ ప్ర‌సంగానికి మంచి స్పంద‌న వ‌చ్చింది.