Begin typing your search above and press return to search.

కేసీఆర్ తిట్టింది బీజేపీనా..? మోడీనా..?

By:  Tupaki Desk   |   18 Nov 2015 4:22 AM GMT
కేసీఆర్ తిట్టింది బీజేపీనా..? మోడీనా..?
X
వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో సాగుతున్న ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భాగస్వామి అయ్యారు. ఇప్పటివరకూ తనపై చేసిన విమర్శలు చేసిన వారందరిపై టోకుగా ధ్వజమెత్తారు. నిప్పులు చెరిగారు. దాదాపు 42 నిమిషాలకు పైనే మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్.. తెలుగుదేశం.. బీజేపీ.. నిరసనకారులు.. మీడియా.. ఇలా ఎవరినీ వదిలిపెట్టలేదు. కాకుంటే.. అందరి కంటే ఎక్కువగా విమర్శలు పడ్డవి బీజేపీకి.. ఆ పార్టీ నేత కిషన్ రెడ్డికే.

కాంగ్రెస్.. టీడీపీ మీద విమర్శలు చేసిన క్రమంలో ఒకరిద్దరు నేతల్ని మాత్రమే ప్రస్తావిస్తే.. బీజేపీ విషయంలో అందుకు భిన్నమైన ధోరణి కనిపించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని.. ఢిల్లీలోని మోడీ సర్కారుపైనా తీవ్రస్థాయిలోధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన సమయంలోనే ఢిల్లీలో బీజేపీ సర్కారు ఏర్పాటు అయ్యిందని.. గడిచిన 16 నెలల్లో తాము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని.. ఢిల్లీలో కొలువు తీరిన బీజేపీ సర్కారు ఒక్కటంటే ఒక్క మంచి పని చేసినా తాను జై కొడతానని చెప్పుకొచ్చారు. సమస్యల పరిష్కారం మీద ఆ మధ్య కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ.. సమస్యల పరిష్కరానికి కేంద్ర సర్కారు దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదన్నారని.. కేంద్రం దగ్గర లేని అద్భుత దీపం తెలంగాణరాష్ట్రం వద్ద ఎలా ఉంటుందని ప్రశ్నించటం విశేషం.

తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమం సాగుతుంటే.. తాము పదవులకు రాజీనామా చేస్తే.. కిషన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయకుండా పారిపోయారని మండిపడ్డారు. నిజామాబాద్ సభలో తాను మాట్లాడుతున్న సమయంలో.. పదవులకు రాజీనామా చేయకుండా పారిపోయిన వారి గురించి మాట్లాడుతుంటే.. సభలో ఉన్న ఒకతను.. సార్.. ఆ పారిపోయిన అతను మీ పక్కనే ఉన్నాడని చెప్పాడని.. పక్కకు చూస్తే కిషన్ రెడ్డి ఉన్నాడని చెప్పుకొచ్చారు.

ఎన్నికల సమయంలో వాళ్లను.. వీళ్లను అన్న తేడా లేకుండా తమ ప్రత్యర్థులందరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం మామూలే. కానీ.. వరంగల్ సభలో కేసీఆర్ ఫోకస్ కేంద్రంలోని బీజేపీ సర్కారు మీదా.. కిషన్ రెడ్డి మీద ఉండటం గమనార్హం. కిషన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఎంత తీవ్రస్థాయిలో కేసీఆర్ విరుచుకుపడ్డారో.. అంతే తీవ్రంగా కేంద్రంలోని బీజేపీ సర్కారును వదిలిపెట్టలేదు. ప్రధాని మోడీ పేరును ప్రస్తావించకుండా ఆయన బీజేపీ సర్కారు గడిచిన 16 నెలల్లో ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదని చెప్పటం విశేషం. కేంద్రంతో పోలిస్తే.. తెలంగాణ సర్కారు ఇప్పటికే ఎన్నో పనులు చేసిందని చెప్పుకున్న కేసీఆర్.. కేంద్రం చేసిన ఒక్క మంచి పని చెప్పినా తాను జై కొడతానని చెప్పటం చూస్తే.. కేంద్రంపై తనకున్న అసంతృప్తిని కేసీఆర్ బాహాటంగానే వ్యక్తం చేశారని చెప్పాలి.

తమ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తున్న బీజేపీ నేతలపై కేసీఆర్ ఫైర్ కావటమే కాదు.. వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని చెప్పాలి. కేసీఆర్ మాటల దాడిని చూస్తే.. తమ వాదనను సమర్థవంతంగా వినిపించే కమలనాథుల మాటల్లో నిజం ఉండదని.. వారి మాటలకు చేతలకు సంబంధం ఉండదని చెప్పటమే తేల్చేయటమే కాదు.. వారి మీద ఉన్న విశ్వసనీయతను దెబ్బ తీసేలా వ్యవహరించటం గమనార్హం. కిషన్ రెడ్డి మీద వ్యక్తిగత వ్యాఖ్యలతో పాటు.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏమీ చేయటం లేదని చెప్పటం ద్వారా పరోక్షంగా మోడీ పని తీరును విమర్శించినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే బీజేపీ పేరుతో ప్రధాని మోడీ పని తీరును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తూర్పార పట్టారని చెప్పొచ్చు. మోడీ ఖాతాలో ఢిల్లీ.. బీహార్ ఎన్నికల ఫలితాల్ని వేసినట్లుగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల్ని మనసులో పెట్టుకొని.. కేసీఆర్ పట్ల ఇప్పటికి గుర్రుగా ఉన్నారన్న మాట రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. అలాంటిది.. తాజా వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ సర్కారు ఏమీ చేయలేదని చెప్పటం.. కేంద్ర సర్కారుతో పోలిస్తే.. తామే చాలా బాగా పని చేసినట్లుగా చెప్పుకున్న దానికి ఫలితం మరెంత తీవ్రంగా ఉంటుందోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హన్మకొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఏ తీరులో రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.