Begin typing your search above and press return to search.

విలేక‌రుల నోట మాట‌కు తిట్ల‌తో కేసీఆర్ స‌మాధానం..?

By:  Tupaki Desk   |   19 Jun 2019 5:40 AM GMT
విలేక‌రుల నోట మాట‌కు తిట్ల‌తో కేసీఆర్ స‌మాధానం..?
X
కాస్త విరామం త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. చెప్పిన మాట‌లు కొన్ని ఆస‌క్తిక‌రంగా.. మ‌రికొన్ని సంచ‌ల‌నంగా మారాయి. అన్నింటికి మించి రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సంబంధాలుఎలా ఉంటాయ‌న్న విషయం మీద ఆయ‌న ఇచ్చిన వివ‌ర‌ణ కొంద‌రికి సంతృప్తిక‌రంగా అనిపిస్తే.. మ‌రికొంద‌రికి మాత్రం తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. విలేక‌రుల స‌మావేశం పేరుతో కేసీఆర్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంపై సీనియ‌ర్ రిపోర్ట‌ర్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ నోటి నుంచి ఏదైనా ప్ర‌శ్న వ‌స్తే చాలు.. క‌య్యిమంటున్నారు. తిట్టిన‌ట్లుగా మాట్లాడుతున్నార‌ని.. ఇదే మాత్రం మంచి ప‌ద్ద‌తి కాదంటున్నారు. అయితే.. మీడియాను టార్గెట్ చేసిన మాట్లాడ‌టం కేసీఆర్ కు కొత్తేం కాద‌ని.. ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న తీరు అలా ఉండేద‌న్న మాట ఉంది.

అధికారం చేతికి రావ‌టంతో ఆయ‌న మాట‌ల్లో ప‌దును మ‌రింత పెరిగింద‌ని.. మీడియా ప్ర‌తినిధులు ఎవ‌రైనా త‌న‌ను ఇరుకున పెట్టే ప్ర‌శ్న వేసే సాహ‌సం చేయ‌కూడ‌ద‌ని.. అస‌లు అలాంటి ఆలోచ‌న రాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే ఆయ‌న అలా సీరియ‌స్ అవుతార‌ని చెబుతారు.

మీడియాను ఎలా కంట్రోల్ చేయాలి? వారి నుంచి ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌లు రాకుండా వారిని ఎలా డిఫెన్స్ లో ప‌డేయాల‌న్న దానిపై ప‌క్కా వ్యూహం ఉంటుందంటున్నారు. తాను చెప్పిన మాట‌లే అయినా.. త‌న‌కు ఇబ్బంది క‌లిగించేలా ఉంటే వెంట‌నే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తార‌ని.. ఆ కోపాన్ని చూసి మిగిలిన మీడియా ప్ర‌తినిధులకు హెచ్చ‌రిక‌గా ఉండాల‌న్న ఉద్దేశంతోనే ఆయ‌న అలా మాట్లాడ‌తార‌ని తెలుస్తోంది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ప్ర‌ధాని మోడీని అతిధిగా పిలుస్తార‌న్న మాట విలేక‌రులు పుట్టించింది కాదు.. కేసీఆర్ అండ్ కో చెప్పిందే. కానీ.. ఈ రోజున మోడీని పిల‌వ‌కూడ‌ద‌ని డిసైడ్ అయిన నేప‌థ్యంలో.. తాము గ‌తంలో చెప్పిన మాట‌ల్ని ప్ర‌స్తావించి త‌న‌ను ఇరుకున ప‌డేయాల‌న్న ఆలోచ‌న మీడియా ప్ర‌తినిధుల‌కు రాకూడ‌ద‌న్న ఉద్దేశంలో కేసీఆర్ ఉంటార‌ని చెబుతారు. ఈ ఆలోచ‌న‌తోనే ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం ద్వారా త‌న‌ను ఇబ్బంది పెట్ట ప్ర‌శ్న‌లు వేయొద్ద‌న్న సందేశంతో కూడిన వార్నింగ్ ఇచ్చేస్తార‌ని చెబుతారు.