Begin typing your search above and press return to search.

ఎదుటోళ్ల సంస్కారం స‌రే..మీ సంగ‌తేంది కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   6 Oct 2018 8:30 AM GMT
ఎదుటోళ్ల సంస్కారం స‌రే..మీ సంగ‌తేంది కేసీఆర్‌?
X
నా నోటికి వ‌చ్చిన‌ట్లు తిడ‌తా.. ప‌డాలి. అంతే త‌ప్పించి ఎదురు మాట్లాడ‌కూడ‌దు. కిమ్మ‌న‌కూడ‌దు. అంటేనా.. నా నోట్లో నుంచి మంచి మాట‌లు రావు.. అర్థ‌మైందా? అని ఎవ‌రైనా రంకెలు వేస్తే వాళ్ల‌ను ఏమ‌నాలి? ప్ర‌జాస్వామ్యం అన్నాక‌.. అందునా రాజ‌కీయాలు అన్నాక నేత‌ల నోటి నుంచి వ‌చ్చే మాట‌లు ఎలా ఉంటాయి? సింఫుల్ గా చెప్పాలంటే కేసీఆర్ మాట‌ల మాదిరి ఉంటాయి.

రాజ‌కీయాల్లో రొచ్చు మాట‌లు మాట్లాడే క‌ల్చ‌ర్ కు పితామ‌హుడిగా కేసీఆర్ కు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. నోటికి వ‌చ్చిన‌ట్లుగా తిట్టేసే అధినేత‌గా కేసీఆర్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న్ను తిట్టేందుకు డిసైడ్ అయ్యే నేత‌లు.. తాము తిట్టాల్సిన తిట్ల‌కు సంబంధించి ప్రైవేటు క్లాసులు పెట్టించుకుంటార‌ని చెబుతారు.

అలాంటి కేసీఆర్‌.. త‌న గురించి త‌ప్పుగా మాట్లాడ‌టం సంస్కార‌మా? అంటూ అడిగే మాట‌లు వింటే.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. కేసీఆర్ కు చంద్ర‌బాబు మాత్ర‌మే కాదు.. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా శ‌త్రువే అన్న విష‌యం తాజాగా నిర్వ‌హించిన వ‌న‌ప‌ర్తి స‌భ చెప్పేసింది. ఆ మాట‌కు వ‌స్తే త‌న అవ‌స‌రాలు.. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రినైనా.. ఎంత‌కైనా మాట అనేసే తీరు కేసీఆర్‌లో ట‌న్నులు ట‌న్నులు ఉంటుంద‌న్న విష‌యం ఇప్ప‌టికే ప‌లుమార్లు స్ప‌ష్ట‌మైంది.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సమ‌యంలో బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థి మోడీని ఉద్దేశించి కేసీఆర్ అన్న మాట‌ల్ని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. దేశం మొత్తంలో ఏ రాజ‌కీయ పార్టీ అధినేత అన‌ని రీతిలో మోడీని ఉద్దేశించి ఇదే కేసీఆర్ ఫాసిస్ట్ అంటూ మాట అనేయ‌టం.. దాన్ని మ‌న‌సులో పెట్టుకొన్న మోడీ ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న త‌ర్వాత తెలంగాణ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌ కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ఈ రోజు మోడీని ఉద్దేశించి ప‌ల్లెత్తు మాట అన‌ని కేసీఆర్.. కాలానికి త‌గ్గ‌ట్లు.. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎలా మాట్లాడ‌తార‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. కాకుంటే.. కాలంతో పాటు కొన్ని విష‌యాల్ని మ‌ర్చిపోవ‌టం చాలామందికి అల‌వాటు. ఈ కార‌ణంతోనే కేసీఆర్ అన్న చాలా మాట‌ల్ని అంద‌రూ మ‌ర్చిపోతుంటారు.

తెలంగాణ రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున ఉద్య‌మం జ‌రుగుతున్న వేళ‌లో.. ఇదే కేసీఆర్ జైపాల్ రెడ్డి గురించి ఎంత గొప్ప‌గా మాట్లాడారో అంద‌రికి తెలిసిందే. ఇదే విష‌యాన్ని కేసీఆర్ మాట‌ల్లో చెప్పాలంటే.. అది చ‌రిత్ర‌. మేం చెప్పే స్టోరీ ఎంత మాత్రం కాదు.

జైపాల్ రెడ్డి త‌లుచుకుంటే గంట‌ల్లో తెలంగాణ తీసుకురాగ‌ల‌ర‌ని.. ఆయ‌న్ను తాను రిక్వెస్ట్ చేస్తున్నాన‌ని.. జైపాల్ రెడ్డి పెద్ద మ‌న‌సుతో తెలంగాణ ఆశ‌ల్ని.. ఆకాంక్ష‌ల్ని ప‌ట్టించుకోవాలంటూ ప‌దే ప‌దే ప్రాధేయ‌ప‌డ‌టం మ‌ర్చిపోకూడ‌దు. అలాంటి కేసీఆర్ కు ఇప్పుడు జైపాల్ అన్న వ్య‌క్తి పిచ్చ లైట్‌. ఆయ‌న్ను ఎన్ని మాట‌లు అనాలో అన్ని మాట‌లు అనేశారు. రిల‌య‌న్స్ అంబానీల‌ను సైతం త‌న తీరుతో వ‌ణికించిన జైపాల్ లాంటి నేత‌.. కేసీఆర్ నోటికి బ‌లి కావ‌ట‌మే కాదు.. ఎంత చుల‌క‌న అయ్యారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

త‌న‌ను ఉద్దేశించి ఎవ‌రైనా ఏదైనా అన్న వెంట‌నే.. సంస్కారం గుర్తుకు వ‌చ్చే కేసీఆర్‌ కు.. తన‌లో అదెంతన్న విష‌యాన్ని ఎందుకు మ‌ర్చిపోతారో ఎంత‌కూ అర్థం కాదు. త‌న‌ను ఒక్క మాట అన్నంత‌నే.. ఒక ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి అంత సంస్కారం లేకుండా ఎలా మాట్లాడ‌తారు? అంటూ ఆక్రోశం వ్య‌క్తం చేసే ఆయ‌న‌.. త‌న మాట‌లే త‌న‌ను ఇంత‌లా తిట్టిపోసేలా చేస్తున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తించ‌కుండా మాట్లాడ‌టం క‌నిపిస్తుంది. కేసీఆర్‌ లో అహంభావం అంత‌కంత‌కూ పెరుగుతోంద‌ని.. తాను అంటే అంద‌రూ ప‌డాలె కానీ ఎవ‌రూ త‌న‌ను ఏమీ అన‌కూడ‌ద‌న్న తీరు దొర‌త‌నంగా ఉంటుంద‌న్న వ్యాఖ్య‌లు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. ఎదుటోళ్ల నుంచి సంస్కారం ఆశించే ఆప‌ద్ద‌ర్మ సీఎం.. తాను అంతే సంస్కారంగా ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో వ్య‌వ‌హ‌రించాల‌ని లేకుంటే అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది. సారూ.. వింటున్నారా?