Begin typing your search above and press return to search.

విపక్షాలు లేని సభలో కేసీఆర్ వార్నింగ్

By:  Tupaki Desk   |   12 March 2017 4:44 AM GMT
విపక్షాలు లేని సభలో కేసీఆర్ వార్నింగ్
X
తన దాకా వస్తే కానీ తత్త్వం తెలీదని ఊరికే అనలేదేమో. అసెంబ్లీలో ఆందోళనలు చేయటం విపక్షాలకు మామూలే. అదికారపక్షం సభ ఔనత్యం గురించి మాట్లాడితే.. విపక్షాలు అదికారపక్షం ఆరాచకాల గురించి మాట్లాడటం.. వారి తీరును నిరసిస్తూ మండిపడటం మామూలే. కాకుంటే..విపక్షంలో తాము చేసినవి.. అధికారపక్షంగా మారిన వెంటనేమైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళనలు ఎన్నో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటమే కాదు.. గవర్నర్ ప్రసంగ ప్రతుల్ని చించివేయటం.. ఆయన చుట్టూ చేరి.. ప్రసంగించకుండా అడ్డుకోవటం లాంటివి టీఆర్ ఎస్ నేతలు చాలానే చేశారన్నది మర్చిపోకూడదు. అయితే..అదంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినట్లుగా చెప్పుకుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

నాడు తాము చేసిన పనుల్ని సమర్థించుకుంటూ.. నేడు తాము సభ ఔనత్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నట్లుగా చెప్పే మాటలన్నీ కాస్త వింతగా..విచిత్రంగా వినిపిస్తాయని చెప్పటంలో సందేహం లేదు. నాడు తాము చేసిన ఆందోళనలంతా తెలంగాణ సాధన కోసమంటూ కేసీఆర్ చేసే వాదనల్లో పసలేదని చెప్పాలి. ఎందుకంటే.. నాడు తెలంగాణ సాధన కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన టీఆర్ ఎస్ నేతల దూకుడు తీరును వంటపట్టించుకున్న మిగిలిన పార్టీల నేతలు.. ఇప్పుడు రతనాల తెలంగాణ కోసం.. సీఎం కేసీఆర్ అహంకారానికి..నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా విపక్షాలు సభలో వ్యవహరిస్తున్నాయనుకోవచ్చుగా. తాము చేస్తేనేమో.. తెలంగాణ కోసం.. అవతల వారు చేస్తే మాత్రంఅదో ఘోర అపరాధంగా అబివర్ణించే కేసీఆర్..సభలో సభ్యులు ఎలా వ్యవహరించాలి? వారిని కంట్రోల్ చేసేందుకు ఏకంగా చట్టమే తీసుకొస్తామని చెబుతున్నారు.

సభలో పిల్లి కూతలు.. రన్నింగ్ కామెంటరీ.. కోపం వస్తే గవర్నర్ ప్రసంగ పత్రాల్ని చించివేయటం లాంటి పనుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్.. అలాంటి వాటికి చెక్ పెట్టే పనిలో బాగంగా అల్లరి చేసే సభ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా ప్రకటించారు. తాము చేసింది తప్పే అయితే తమను ప్రజలు శిక్షిస్తారని.. అదే విపక్ష సభ్యులు చట్టాలు అతిక్రమిస్తే..వారినే శిక్షిస్తారని చెప్పుకొచ్చారు.

గతంలో తాము గవర్నర్ ప్రసంగం చేసే సమయలో దాడి చేసినట్లు చెబుతున్నారనిఅయితే అదంతా తెలంగాణ రాష్ట్రసాధనలో భాగంగా చేసిందే తప్ప మరింకేమీ కాదని కేసీఆర్ సమర్థించుకోవటం గమనార్హం. విషయం ఏదైనా.. తమకు తోచినట్లుగా చేసిన టీఆర్ఎస్ నేతల తీరును విపక్షాలు ఫాలో కావటం తప్పేం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇవాళ ఇన్ని మాటలు చెబుతున్న కేసీఆర్..రేపొద్దున విపక్షంలో కూర్చున్న వేళ.. తాము చేసే నిరసనలు.. ఆందోళనలకు కొత్త భాష్యం చెప్పరన్న గ్యారెంటీ ఏమీ లేదు.

ఈ తరహా మాటల్నిపక్కన పెడితే..కేసీఆర్ తాజాగా చెబుతున్న మాటల్ని చూస్తే.. సభలో స్కూల్ పిల్లాడిలా కూర్చోవాలన్నట్లుగా కేసీఆర్ మాటలున్నట్లుగా చెప్పొచ్చు. సభలో సభ్యులు రెచ్చిపోవటాన్ని మేం ఆమోదించటం లేదు. కానీ.. తాము చేసిన వాటిని సమర్థించుకోవటం.. ప్రత్యర్థి పార్టీల వారు చేస్తే..అదో పెద్ద దుర్మార్గంగా అభివర్ణించటం పైనే అభ్యంతరమే తప్పించి..సభ హుందాగా జరిగితే అంతకుమించి కావాల్సిందేముంది? సభా మర్యాదల గురించి మాట్లాడే కేసీఆర్ లాంటి వారి మాటలన్నీ..తాము చెప్పినట్లే విపక్షాలు నడుచుకోవాలన్నట్లుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారపక్షంగా విపక్షాలు బుద్ధిగా ఉండాలని ఆశించటం తప్పేం కాదు. కానీ.. తాము విపక్షంలో ఉన్నప్పుడేం చేశామన్న విషయాన్ని మర్చపోకూడదు. నీతులు చెప్పేందుకే ఉన్నాయే తప్పించి.. ఆచరించి అమలు చేసేందుకు కాదని ఊరికే అనలేదేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/