Begin typing your search above and press return to search.

కేసీఆర్ అంటే మోడీ..రాహుల్ వ‌ణికిపోతున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   27 April 2018 10:04 AM GMT
కేసీఆర్ అంటే మోడీ..రాహుల్ వ‌ణికిపోతున్నార‌ట‌!
X
త‌న‌ను తాను త‌క్కువ‌గా చేసుకుంటూనే.. అంత‌లోనే తానెంత మొన‌గాడిన‌న్న విష‌యాన్ని చెప్పుకునే నేర్పు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంత‌న్న‌ది తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే. తాజాగా అలాంటి నైపుణ్యాన్నే ప్ర‌ద‌ర్శించారు కేసీఆర్‌. టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా స్వాగ‌తోప‌న్యాసాన్ని చేసిన కేసీఆర్‌.. నాలుగేళ్ల కాలంలో త‌మ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల్ని వివ‌రంగా చెప్పిన ఆయ‌న‌.. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

త‌న‌ను తాను బ‌క్క ప్రాణంగా అభివ‌ర్ణించుకుంటూనే.. కేసీఆర్ త‌లుచుకుంటే నింగిని.. నేల‌ను ఏకం చేస్తామ‌న్న మాట‌ను చెప్పుఉకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం తాను ప‌డిన బాధ‌ల్ని గుర్తు చేసుకున్న కేసీఆర్‌.. దేశంలోని రాజ‌కీయ పార్టీల‌ను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి తీసుకొచ్చామ‌ని.. అదే రీతిలో దేశంలో బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా కొత్త త‌ర‌హా రాజ‌కీయాన్ని తీసుకొస్తామ‌న్న క‌ల‌ను ఆవిష్క‌రించారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో తాను చేసిన చిన్న ప్ర‌క‌ట‌న దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంద‌ని.. త‌న మీద రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై విరుచుకుప‌డ్డారు.

తానంటే రాహుల్ కు భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు. తాను మోడీ ఏజెంట్‌ న‌ని కాంగ్రెస్ నేత‌లు మాట్లాడుతున్నార‌ని.. త‌మ‌కు ఆ అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసిన కేసీఆర్‌.. కాంగ్రెస్‌.. బీజేపీల‌ను బండ‌కేసి బాదిన‌ట్లుగా ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా స్వాతంత్య్రం వ‌చ్చిన 70 ఏళ్ల‌లో దేశం ఎంత వెనుక‌బాటుత‌నంలో ఉంద‌న్న విష‌యాన్ని ప‌లు ఉదాహ‌ర‌ణ‌ల‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

పొరుగున ఉన్న చైనాలో జ‌రుగుతున్న అభివృద్ధిని ప‌లుమార్లు ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. కేంద్రం అనుస‌రిస్తున్న విధానాలను తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కేంద్ర పాల‌నా తీరు.. రాష్ట్రాల ప‌ట్ల అది వ్య‌వ‌హ‌రించే తీరుపైనా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించ‌ట‌మే కాదు.. వ్య‌వ‌సాయం.. ఆరోగ్యం.. గ్రామీణాభివృద్ధి.. రోడ్లు.. లాంటి ప‌లు శాఖ‌లు కేంద్రం ద‌గ్గ‌ర అస‌లు ఎందుకు ఉండాల‌న్న సూటిప్ర‌శ్న‌ను సంధించారు.

రోడ్లు.. రైల్వేలు.. నౌకాయానం లాంటి అంశాల్ని ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. ఏ రంగంలోనూ బీజేపీ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఏమీ చేయ‌లేక‌పోయార‌న్న అసంతృప్తిని వ్య‌క్తంచేశారు. నాలుగేళ్ల త‌మ పాల‌న‌లో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ అమ‌లు చేయ‌ని కొత్త కొత్త పథ‌కాల‌కు శ్రీ‌కారం చుట్ట‌ట‌మే కాదు.. తెలంగాణ స‌రిహ‌ద్దు రాష్ట్రాలు సైతం వాటిని అమ‌లు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి తీసుకొచ్చామ‌న్నారు.

భూరికార్డుల ప్ర‌క్షాళన‌ కార్య‌క్ర‌మాన్ని వంద‌రోజుల్లోనే పూర్తి చేశామ‌ని.. వేరే రాష్ట్రాల్లో అయితే ప్ర‌భుత్వాలే ప‌డిపోయేవ‌న్న కేసీఆర్‌.. దేశంలో మ‌రెక్క‌డా అమ‌లు చేయ‌ని ఎన్నో ప‌థ‌కాల్ని తాము అమ‌లు చేసిన‌ట్లు చెప్పారు.

దేశంలోనే తొలిసారి మే 10 నుంచి రైతుల‌కు ఎక‌రాకు రూ.8వేలు చొప్పున సాయాన్ని అందించ‌నున్న‌ట్లు చెప్పారు. అంగ‌న్ వాడీ.. ఆశా..హోంగార్డుల‌కు దేశంలో మ‌రే రాష్ట్రంలో లేనంత ఎక్కువ‌గా జీతాలు ఇస్తున్న‌ట్లు చెప్పారు. అంతేకాదు.. ప‌శువుల‌కు అంబులెన్స్ సౌక‌ర్యంతో పాటు.. వ్య‌వ‌సాయానిక నిరంత‌ర విద్యుత్‌.. ట్రాఫిక్ పోలీసుల‌కు మూల‌వేత‌నంలో 30 శాతాన్ని పెంచామ‌ని.. ఇలా ఎన్నో కార్య‌క్ర‌మాలుచేప‌ట్టిన‌ట్లు చెప్పారు.

పాల‌నా సంస్క‌ర‌ణ‌లో భాగంగా 10 జిల్లాల‌ను కాస్తా 31 జిల్లాలుగా మార్చామ‌ని చెప్పారు. జిల్లాకు వెయ్యి కోట్లు చొప్పున కేటాయించి కొత్త జిల్లా కేంద్రాల్ని అభివృద్ధి చేస్తున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలోని పాల‌న‌ను వివిద రాష్ట్రాల‌కు చెందిన నేత‌లు ప‌లువురు మెచ్చుకుంటున్నార‌న్నారు.దేశంలోని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు టీఆర్ ఎస్ పాల‌న‌ను మెచ్చుకుంటున్నార‌ని.. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు మండిప‌డ్డారు.

జాతీయ రాజకీయాల్లో క్రియాశీల‌క పాత్ర పోషించే బాధ్య‌త ప్ర‌జ‌లు త‌మ‌కు అప్ప‌గించిన‌ట్లు చెప్పిన కేసీఆర్‌.. దేశం కోసం తాను చేసిన ఆలోచ‌న‌ల‌కు దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు వ‌చ్చిన‌ట్లుగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.

త‌మ ఫ్రంట్ కు టెంట్ లేద‌ని ఎక్కెసం చేస్తున్నార‌ని.. అలా మాట్లాడుతున్న బీజేపీ నేత‌ల‌కు కేసీఆర్ అంటే భ‌య‌మ‌న్నారు. కేసీఆర్ జెండా ఎత్తితే దించ‌డ‌ని.. దేశం గురించి బీజేపీ.. కాంగ్రెస్ లు మాత్ర‌మే మాట్లాడ‌తాయా? మిగిలిన వారు మాట్లాడ‌కూడ‌దా? అంటూ ప్ర‌శ్నించారు. జ‌ల‌స‌మ‌స్య‌ల మీద తాను సంధించిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌ధాని మోడీ.. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ లు సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

రాష్ట్రాల‌ను త‌మ అధీనంలో ఉంచుకోవ‌టానికి కేంద్రం అనుస‌రిస్తున్న విధానాల్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన ఆయ‌న‌.. బీజేపీ.. కాంగ్రెస్ త‌స్మాత్ జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిక జారీ చేయ‌టం గ‌మ‌నార్హం.