Begin typing your search above and press return to search.

ఫాంహౌస్‌ ఫోటోలకు కేసీఆర్‌కు కోపం వచ్చేసిందట

By:  Tupaki Desk   |   26 Jun 2015 4:32 AM GMT
ఫాంహౌస్‌ ఫోటోలకు కేసీఆర్‌కు కోపం వచ్చేసిందట
X
పేద్ద టోపీ పెట్టేసుకొని.. పక్కనున్న వారికి ఆదేశాలు ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పక్కనే ఓటుకు నోటు వ్యవహారంలో అత్యంత కీలకంగా ఉన్న నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ నిలుచున్న ఫోటో గురువారం నాటి అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. వాస్తవానికి ఈ ఫోటోను బుధవారం మధ్యాహ్నం నుంచే టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి.

ఓటుకు నోటుకు కేసులో కీలకంగా ఉన్న స్టీఫెన్‌సన్‌కు.. కేసీఆర్‌ ఫాంహౌస్‌లో పనేంటంటూ పెద్దపెద్ద శీర్షికలతో వార్తలు రావటం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిరాకు పుట్టించిందట. తన రాజప్రసాదం లాంటి ఫాంహౌస్‌లోకి మీడియా కెమేరాలు ఎలా వచ్చాయని చిర్రుబుర్రులాడారట. మీడియా వచ్చేసి ఫోటోలు తీసుకుంటుంటే.. మీరేం చేస్తున్నారంటూ భద్రతా అధికారులపై మండిపడ్డారట.

దీంతో నీళ్లు నమిలిన భద్రతా సిబ్బంది.. కేసీఆర్‌ కోపాన్ని రుచి చూడాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో.. గురువారం తామేంటో చూపించిన భద్రతా సిబ్బంది.. ఫాంహౌస్‌కి రెండుకిలోమీటర్ల నుంచే కాపలా కాయటం మొదలు పెట్టారు.

మీడియాను అలా దూరంగా పెట్టేసిన భద్రతాఅధికారులు.. సామాన్యుల్ని సైతం తనిఖీ చేసిన తర్వాతే పంపారు. ఇక.. ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చిన పలు ప్రజాసంఘాల వారిని సైతం అనుమతించకుండా వెనక్కి పంపేశారు. మొత్తానికి ఫాంహౌస్‌లో స్టీఫెన్‌సన్‌తో గడిపిన ఫోటో ముఖ్యమంత్రికి బాగానే ఆగ్రహం కలిగేలా చేసిందట.