Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ గుస్సా!

By:  Tupaki Desk   |   9 Oct 2016 9:56 AM GMT
టీ కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ గుస్సా!
X
గడిచిన కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. సహజంగానే కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా ఉండే కేసీఆర్ మాటలకు ఆవేశం కూడా తోడైతే ఎలా ఉంటుందన్నది తాజాగా పెట్టిన మీడియా సమావేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే వరంగల్ లోని భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటం సమర్పించేందుకు వచ్చిన ఆయన.. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్తవి చేయటం చేతకాని సన్నాసులుగా కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయిన ఆయన.. వారికి ఆలోచనే లేదంటూ పలుమార్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. ఒకే జిల్లాకు సంబంధించి ఒక నేత ఒక వాదన వినిపిస్తే.. మరో నేత మరో వాదన వినిపిస్తారని.. ఒకే పార్టీ నేతల మధ్యనే సమన్వయం లేదని మండిపడ్డారు.

అరవై ఏళ్ల పాలనలో కొత్తగా చేసిందేమీ లేక.. తెలంగాణను సర్వనాశనం చేసిన కాంగ్రెస్ నేతలకు.. తమ ప్రభుత్వం చేస్తున్న పనులకు షాక్ తింటున్నారని.. ఏదో విధంగా విమర్శలు చేయాలన్నట్లుగా వారి తీరుఉంటుందన్న కేసీఆర్.. ఒకదశలో.. ‘సన్నాసులు’.. ‘చవటలు’.. ‘చేతకానివాళ్లు’ లాంటి మాటల్ని అలవోకగా అనేశారు. అన్నింటికి మించి అందరి దృష్టినిఆకర్షించిన మరో అంశం ఏమిటంటే.. కాంగ్రెస్ నేతలకు తెలివి లేదని.. ఎప్పుడు ఏ అంశం మీద పోరాటం చేయాలో కూడా వారికి తెలీదంటూ వ్యంగ్య వ్యాఖ్యలతో ఉతికి ఆరేశారు.

ఓపక్క వర్షాలు భారీగా పడి.. తెలంగాణలోని నదులు.. చెరువులు అన్ని నిండిపోయిన వేళ.. తెలంగాణ రైతులు కాల్వల దగ్గర మేకపోతులు కోస్తూ పండగ చేసుకుంటుంటే.. ఇలాంటి సమయంలో రైతుల సమస్యల మీద బుద్ధి ఉన్నోడు ఎవరైనా మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు. ఏం మాట్లాడుతున్నాం.. ఏం చేస్తున్నాం? ఎప్పుడు ఏం చేయాలి? అన్న ఆలోచన కాంగ్రెస్ నేతల్లో అస్సలు కనిపించటం లేదంటూ కేసీఆర్ ఫైరింగ్ తీవ్రస్థాయిలో ఉందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/