Begin typing your search above and press return to search.

మంత్రుల‌పై కేసీఆర్ ఆగ్ర‌హం రిజ‌ల్ట్ ఇస్తోంది

By:  Tupaki Desk   |   19 Feb 2017 9:30 AM GMT
మంత్రుల‌పై కేసీఆర్ ఆగ్ర‌హం రిజ‌ల్ట్ ఇస్తోంది
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌పై ఫైర‌వ‌డంతో అమాత్యుల్లో మార్పు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయించాల్సిన మంత్రులు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న అభిప్రాయం అధికార టీఆర్‌ ఎస్‌ పార్టీలో ఉంది. దీనిపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సీరియస్‌ ఉన్నారని తెలిసింది. మంత్రులు ప్రజలకు సీఎం ఆదేశంతో అందుబాటులో ఉండకుండా, పేదల నుంచి వస్తున్న ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించకుండా ముఖం చాటేస్తున్నారని, మంత్రులపై కింది స్థాయి నేతల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు అనేక సమస్యల మీద ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రిపైనే విమర్శలు చేస్తుండడంతో కేసీఆర్‌ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొంతమంది మంత్రులను వ్యక్తిగతంగా పిలిపించుకొని మాట్లాడినట్టు కూడా తెలిసింది. దీంతో రాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరు జిల్లాల బాట పట్టారు. ఇప్పటివరకు శాఖల సమీక్షలు - నియోజకవర్గాలకే మంత్రులు పరిమితమయ్యారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు దాడి చేస్తుండడంతో వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి - టీజేఏసీ చైర్మెన్‌ కోదండరామ్‌ - పాదయాత్ర ద్వారా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే, మాట్లాడే సమయం కూడా లేదా అని నిలదీసినట్టు తెలిసింది. ప్రభుత్వ పథకాలను కూడా చెప్పుకునే సాహసం చేయకపోతే ఎలా అని, శాఖలపై పట్టు పెంచుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్‌లో కాకుండా ప్రజల్లో చెప్పడం వల్ల టీఆర్‌ఎస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మేలు జరుగుతుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మంత్రులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకు మంత్రులు గ్రామాల్లోకి తరలి వెళ్లాలని సీఎం ఆదేశించారని టీఆర్‌ ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. సీఎం ఆదేశాలమేరకు మంత్రులు ఇప్పటికే జిల్లాల బాట పట్టారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు - ఈటల రాజేందర్‌ - పోచారం శ్రీనివాసరెడ్డి - జగదీశ్‌ రెడ్డి - కడియం శ్రీహరి - జూపల్లి కృష్ణారావు జిల్లాల్లో పర్యటిస్తూ అనేక శంకుస్థానలు చేస్తున్నారు. ఖమ్మంలో సీపీఎం మహాజన పాదయాత్ర జరుగుతుండడంతో తుమ్మల ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, లేకపోతే ఎవరినీ పట్టించుకునే వారు కాదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ కూడా కరీంనగర్‌ జిల్లాతోపాటు సొంత నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కడియం శ్రీహరి - చందూలాల్‌ - జగదీశ్‌ రెడ్డి ఎస్సీ - ఎస్టీ సబ్‌ ప్లాన్‌ పై చురుగ్గా సమావేశాలు నిర్వహించారు. హరీశ్‌ రావు అన్ని జిల్లాల్లో పర్యటించగా, కేటీఆర్‌ హైదరాబాద్‌ తో పాటు మిగతా మున్సిపాల్టీలపై దృష్టి పెట్టారు. లక్ష్మారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శిస్తూ సమీక్షలు చేస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల కాంగ్రెస్‌ నేతలపై స్వరం పెంచారు. రాజధానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌ - పద్మారావు తమ సొంత నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారు.

మ‌రోవైపు ఇటీవ‌లే పీసీసీ ర‌థ‌సార‌థి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విడుద‌ల చేసి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సర్వే ఫలితాలపై అధికార టీఆర్‌ ఎస్‌ పార్టీలో చర్చ నడిచినట్టు తెలిసింది. ఆ సర్వేపై విశ్వాసం లేదని టీఆర్‌ ఎస్‌ నేతలు కొట్టేస్తున్నా...ఆ సర్వేను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని టీఆర్‌ ఎస్‌ వర్గాలు అంటున్నాయి. టీఆర్‌ ఎస్‌ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో ఆ సీట్లలో కాంగ్రెస్‌కు సానుకూలంగా ఉందని తెలుస్తోంది. బలహీనమైన ప్రాంతాలపై టీఆర్‌ ఎస్‌ దృష్టిపెట్టింది. బడ్జెట్‌ సమావేశాల అనంతరం పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారని గులాబీ వ‌ర్గాలు వివ‌రిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/