Begin typing your search above and press return to search.

గులాబీ నేత‌ల‌కు కేసీఆర్ అర్థ‌రాత్రి ఫోన్!

By:  Tupaki Desk   |   30 March 2019 5:01 AM GMT
గులాబీ నేత‌ల‌కు కేసీఆర్ అర్థ‌రాత్రి ఫోన్!
X
చిన్న త‌ప్పుల‌కు పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కేసీఆర్‌.. కారు.. ప‌ద‌హారు అంటూ రిథ‌మిక్ నినాదంతో 16 ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకొని తెలంగాణ‌లో క్లీన్ స్వీప్ చేయాల‌న్న గులాబీ బాస్ క‌ల‌ను దెబ్బ కొట్ట‌ట‌మే కాదు.. ఇప్పుడున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన హైద‌రాబాద్ గులాబీ నేత‌ల‌పై కేసీఆర్ చిర్రుబుర్రులు ఆడుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

తాజాగా ఎల్ బీ స్టేడియంలో నిర్వ‌హించిన భారీ స‌భ‌కు ఐదు వేల మంది కూడా హాజ‌రుకాక‌పోవ‌టంపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. శుక్ర‌వారం సాయంత్రం మిర్యాల‌గూడ స‌భ‌కు హాజ‌రైన కేసీఆర్‌.. త‌న‌కు మ‌రింత‌సేపు మాట్లాడాల‌ని ఉన్నా.. హెలికాఫ్ట‌ర్ కు టైం ఉంటుంద‌ని.. హైద‌రాబాద్‌ లో స‌భ ఉంద‌ని.. దానికి హాజ‌ర‌వుతున్న‌ట్లుగా చెప్పిన కేసీఆర్‌.. త‌న స్పీచ్ ను త్వ‌ర‌గా ముగించారు. మ‌రి.. హైద‌రాబాద్ స‌భ‌కు వెళుతున్నట్లుగా చెప్పిన కాసేప‌టికే హైద‌రాబాద్‌ లో నిర్వ‌హిస్తున్న స‌భ‌కు రాలేన‌న్న స‌మాచారం ఇవ్వ‌టంతో పాటు.. స‌భ‌ను త్వ‌ర‌గా ముగించాలని ఆదేశించిన‌ట్లు చెబుతున్నారు.

శుక్ర‌వారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఎల్ బీ స్టేడియంలో ప్రారంభం కావాల్సిన స‌భ‌.. ఆల‌స్యం కావ‌టం ఒక‌టైతే.. గులాబీ నేత‌ల్లో పెరిగిన ఆత్మ‌విశ్వాసం.. మితిమీరిపోవ‌టంతో మొద‌టికే మోసం వ‌చ్చిన ప‌రిస్థితి. ఎవ‌రికి వారు త‌మ‌కు తిరుగులేద‌ని.. స‌భ స‌క్సెస్ ప‌క్కా అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన వైనం గులాబీ అధినేత‌కు దిమ్మ తిరిగే షాకిచ్చిన‌ట్లైంది. స‌భ‌కు అవ‌స‌ర‌మైన జ‌న‌సమీక‌ర‌ణ‌లో వైఫ‌ల్యం ఎవ‌రిద‌న్న దానిపై దృష్టి పెట్టిన కేసీఆర్‌.. శుక్ర‌వారం రాత్రి నుంచే న‌గ‌ర నేత‌ల‌కు త‌లంటిన‌ట్లు చెబుతున్నారు.

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. చిన్న చిన్న విష‌యాలే పెద్ద‌వి అవుతాయ‌ని.. ఎల్ బీ స్టేడియంకు జ‌నం రాక‌పోయిన వైనం భారీ ఎత్తున ప్ర‌చారం జ‌రిగితే.. పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీయ‌ట‌మే కాదు.. కేడ‌ర్ లో ఆత్మ‌విశ్వాసం త‌గ్గుతుంద‌న్న ఆగ్ర‌హం కేసీఆర్ మాట‌ల్లో వినిపించిన‌ట్లు చెబుతున్నారు. ఎల్ బీ స్టేడియం స‌భ‌కు ఐదు వేల మంది కూడా లేర‌న్న విష‌యాన్ని నిఘా వ‌ర్గాల ద్వారా తెలుసుకున్న కేసీఆర్‌.. స‌భ‌కు రాకుండా ప్ర‌గ‌తి భ‌వ‌న్ వెళ్లిపోయారు.

ఆ వెంట‌నే.. న‌గ‌ర నేత‌ల‌కు ఫోన్లు చేసి త‌లంటిన‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆగ్ర‌హంతో కొంద‌రు నేత‌ల‌కు నిద్ర లేని రాత్రిగా మారిన‌ట్లు చెబుతున్నారు. ఈ రోజు (శ‌నివారం) ఉద‌యం త‌న వ‌ద్ద‌కు రావాల‌న్న ఆదేశాలు జారీ చేయ‌టంతో.. న‌గ‌ర నేత‌లు భ‌యంతో వ‌ణ‌కుతున్న‌ట్లుగా స‌మాచారం.