Begin typing your search above and press return to search.

మరో ఎన్నికకు డేట్ ఫిక్స్ చేసిన కేసీఆర్..

By:  Tupaki Desk   |   13 April 2019 5:22 AM GMT
మరో ఎన్నికకు డేట్ ఫిక్స్ చేసిన కేసీఆర్..
X
బ్యాక్ టు బ్యాక్ ఎన్నికల్ని ఎప్పుడైనా చూశారా? తెలంగాణ అధికారపక్షం పుణ్యమా అని.. బ్యాక్ టు బ్యాక్ ఎన్నికల్ని చూసే అవకాశం తాజాగా దక్కనుంది. ముందస్తుకు వెళ్లిన కేసీఆర్.. ఆ ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ ఎన్నికలు రావటం.. వాటి ఫలితాల సమయానికే లోక్ సభ ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. తాజాగా లోక్ సభ ఎన్నికల పర్వం ముగిసి.. ఓట్ల లెక్కింపుకోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి.

మే 23 వరకు ఓట్ల లెక్కింపు లేని నేపథ్యంలో.. ఎవరికి వారు తమకు తోచిన లెక్కలు వేసుకుంటూ.. విశ్లేషణలు చేసుకుంటూ గెలుపు మాదంటే.. మాదంటూ చెప్పుకోవటం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. బ్యాలెన్స్ ఉన్న స్థానిక ఎన్నికల్ని ఇప్పుడు నిర్వహించేస్తే.. వేడిలో వేడి అన్నట్లుగా ఉంటుందన్న ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం.. ఎన్నికల ఫలితాల వెల్లడికి చాలా టైం ఉన్న నేపథ్యంలో.. ఈ సమయంలోనే జిల్లా.. మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తే సరిపోతుందన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

దీనికి తగ్గట్లే.. ఎన్నికల ప్రక్రియను ఈ నెల 22 నుంచి మే 14 వరకు నిర్వహిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. జిల్లా పరిషత్.. మండల పరిషత్ ల పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తదుపరి ఎన్నికలకు ప్రభుత్వం ఓకే చెప్పటంతో.. రానున్నకొద్ది రోజుల్లో మరో ఎన్నికల పండక్కి రాష్ట్రం తయారు కానుందని చెప్పక తప్పదు.

అయితే.. ఈ ఎన్నికల్ని నిర్వహిస్తారు కానీ.. ఫలితాల్ని వెల్లడించరు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే.. స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. మొత్తమ్మీదా.. మరో ఎన్నికలకు తెలంగాణ ప్రజలు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను పరిశీలించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేయనుంది.