Begin typing your search above and press return to search.

రెండు పండ‌గ‌ల‌కు రెండు టార్గెట్లు పెట్టిన కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   1 Aug 2018 6:32 AM GMT
రెండు పండ‌గ‌ల‌కు రెండు టార్గెట్లు పెట్టిన కేసీఆర్‌!
X
అంద‌రూ ప‌నులు చేస్తారు.కానీ.. కొంద‌రు మాత్ర‌మే చేసిన ప‌నిని మా గొప్ప‌గా చెప్పుకుంటారు. అలాంటి కోవ‌లోకే వ‌స్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. తాను చేసిన రూపాయి ప‌నికి రూపాయిన్న‌ర మైలేజీ సొంతం చేసుకోవ‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా. ఎప్ప‌టిక‌ప్పుడు కొంగొత్త ప‌థ‌కాల‌తో తెలంగాణ‌లో ఏదేదో జ‌రిగిపోతుంద‌న్న భావ‌న క‌లిగించ‌టంలో ఆయ‌న ఎప్పుడూ స‌క్సెస్ అవుతూ ఉంటారు.

ఒక ఇష్యూ గుట్టు అంద‌రికి అర్థ‌మ‌య్యేలోపు.. మ‌రో ఇష్యూను టేక‌ప్ చేయ‌టం.. కొత్త ఆశ‌ల్ని రేకెత్తించ‌టంలో కేసీఆర్ కు తిరుగులేద‌ని చెప్పాలి. 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి మీ ఇళ్ల‌కు కానీ న‌ల్లా నీళ్లు రాకుంటే.. మేం ఓట్లు అడ‌గ‌నే అడ‌గ‌మ‌న్న మాట మీద దాదాపు ఏడాది పాటు బండి లాగించిన కేసీఆర్‌.. ఆ త‌ర్వాత ఆ ఊసే చెప్ప‌టం మానేశారు. ఎన్నిక‌ల నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న‌ల్లా నీళ్లు ర‌ప్పించ‌టం అంత తేలికైన విష‌యం కాద‌న్న స‌త్యం ఆయ‌న‌కు బాగానే అర్థ‌మైనట్లుంది.

అంతే.. అప్ప‌టివ‌ర‌కూ పెద్ద ఎత్తున శ‌ప‌ధాల స్థానే.. సైలెంట్ అయిన ఆయ‌న‌.. ఆ విష‌యాన్ని ఇప్పుడు ప్ర‌స్తావించ‌టమే మానేశారు. అయితే.. తాను అనుకున్న ల‌క్ష్యం మొత్తంగా కాకున్నా.. ఎంతో కొంత వ‌ర‌కైనా పూర్తి అయితే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా రెండు టార్గెట్ల‌ను పెట్టేశారు. గ‌తంలో ఆయ‌న చెప్పిన దాని ప్ర‌కారం మిష‌న్ భ‌గీర‌థ ద్వారా పంద్రాగ‌స్టు నాటికి ప్ర‌తి ఇంటికి నీళ్లు ఇవ్వాల్సి ఉంది. అది సాధ్యం కాద‌న్న విష‌యం అర్థ‌మైన నేప‌థ్యంలో ఆయ‌న త‌న మాట‌ను కాస్త మార్చారు.

రెండు పండ‌గ‌ల‌కు.. రెండు టార్గెట్లు ఇచ్చిన ఆయ‌న‌.. పంద్రాగ‌స్టు నాటికి ప్ర‌తి ఊరికి మిష‌న్ భ‌గీర‌థ కింద నీళ్లు వెళ్లేలా చేయాల‌ని.. అదేస‌మ‌యంలో ఈ దీపావ‌ళి నాటికి ప్ర‌తి ఇంటికి న‌ల్లా నీరు వ‌చ్చేలా చేయ‌ట‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా సంబంధిత అధికారులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నులు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల్లో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ప‌నుల్ని ఒక‌సారి చెక్ చేసుకొని.. పెండింగ్ ప‌నుల్ని ప‌రుగులు తీయించాల‌ని ఆదేశించారు. ఎంత సీఎం చెబితే మాత్రం.. ప్ర‌భుత్వ శాఖ‌లు ఆయ‌న కోరుకున్నంత వేగంగా ప‌రుగులు తీయ‌లేవు క‌దా? మ‌రి.. రెండు పండ‌గ‌లు.. రెండు ల‌క్ష్యాలంటూ ఆయ‌న వినిపిస్తున్న కొత్త పాట ఎంత‌వ‌ర‌కు వ‌ర్క్ వుట్ అవుతుందో చూడాలి.