Begin typing your search above and press return to search.

మాట మోడీది.. యాక్షన్ కేసీఆర్ ది

By:  Tupaki Desk   |   28 Nov 2016 4:22 AM GMT
మాట మోడీది.. యాక్షన్ కేసీఆర్ ది
X
నమ్మకున్నా నిజంగానే నిజం ఇది. కావాలంటే ఆధారాలు చూపిస్తాం. నిన్నమొన్నటి వరకూ నోట్ల రద్దుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వినిపించిన వాదన ఏమిటో గుర్తుంది కదా? నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ప్రజలు తీవ్ర కష్టాలకు గురి అవుతారని.. ఈ నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించిన తీరుపైనా.. దాని కారణంగా రాష్ట్రానికి జరిగే నష్టం మీద తన వాదనను వినిపించారు.

అదే సమయంలో.. కరెన్సీ కొరతతో కష్టాలు పడుతున్న ప్రజలకు ఊరడింపు మాటల్ని ఆయన నోట నుంచి రాలేదు. అలాంటిది ఇప్పుడు అందుకు భిన్నంగా ఆయన మాటలు మారిపోయాయి. ఉన్నట్లుండి కేసీఆర్ మాట తీరు మారిపోయిందా? అంటే లేదనే చెప్పాలి. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో ఇరువురు కాసింత ఏకాంతంగా మాట్లాడుకున్న మాటల అనంతరం.. కేసీఆర్ మాటల్లో మార్పు వచ్చేసిందని చెప్పాలి.

ఆదివారం ఉదయం తన మన్ కీ బాత్ కార్యక్రమంలో నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలు నడవాలని.. డిజిటల్ లావాదేవీల్ని జరపాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో యువత ముందుకు రావాలని.. అందుబాటులోకివచ్చిన సాంకేతికతను వినియోగించుకోవాలని కోరారు. పొద్దున్నే మోడీ నోటి నుంచి వచ్చిన మాటల మాదిరి.. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి రావటం గమనార్హం.

నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించటం సరికాదని.. ప్రజలు పడుతున్న కష్టాలను.. ఇబ్బందుల్ని తొలగించటానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ అధికారుల్ని ఆయన ఆదేశించారు. ఇందులో భాగంగా.. నగదు రహిత లావాదేవీల్ని జరిపేందుకు వీలుగా ప్రజలకు అవగాహన కల్పించాలని.. అందుకు ఏమేం చేయాలో చేయాలంటూ అధికారుల్ని కేసీఆర్ సమాయుత్తం చేస్తున్నారు. బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడి.. ప్రభుత్వం తరఫున ఏమేం చేయాలో చూడాలని చెప్పటం చూస్తే.. మాటలు మోడీవి అయితే.. యాక్షన్ కేసీఆర్ ది అన్న భావన కలగటం ఖాయం.

నగదు రహిత లావాదేవీలపై తమ ప్రభుత్వ విధానాన్ని నిర్ణయించేందుకు వీలుగా కీలక మంత్రులతో ఆయన ఒక భేటీని నిర్వహించారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.. మంత్రులు హరీశ్ రావు.. జగదీశ్ రెడ్డి.. మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి.. సీఎస్ రాజీవ్ శర్మ.. నర్సింగ్ రావు.. శాంత కుమార్ తో సహా పలువురు కీలక అధికారులతో ఆయనభేటీ అయ్యారు. అంతేకాదు.. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటానికి వీలుగా అవసరమైన విధానాన్ని నిర్ణయించటానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయటం చూస్తే.. మోడీ మాటల్నియాక్షన్ లోకి తెచ్చేందుకు కేసీఆర్ సమాయుత్తం అవుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/