Begin typing your search above and press return to search.

బాబుపై మరింత ఒత్తిడికి కేసీఆర్ స్కెచ్

By:  Tupaki Desk   |   24 Dec 2016 4:36 AM GMT
బాబుపై మరింత ఒత్తిడికి కేసీఆర్ స్కెచ్
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఇర‌కాటంలో ప‌డేసేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రో కీల‌క అడుగు వేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిపాల‌న అమ‌రావ‌తికి త‌ర‌లివెళ్లిన నేప‌థ్యంలో ప‌దేళ్ల‌ ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ లో ఉన్న భ‌వ‌నాలు - ప్ర‌భుత్వ కార్యాల‌యాలు తమ‌కు అప్ప‌గించాల‌ని గ‌తంలోనే కేసీఆర్ కోరిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ముంద‌డుగు ప‌డిన‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ నిలిచిపోయింది. ఈ ప‌రిణామాన్ని స‌మీక్షించుకున్న కేసీఆర్ త‌న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకునేందుకు కొత్త క‌మిటీని వేశారు. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు - ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపు - వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం త్రిసభ్య కమిటీని సీఎం నియమించారు.

ఇటీవ‌లే బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప్రభుత్వ అంతరాష్ట్ర సంబంధాల సలహాదారు జీ వివేకానంద - మంత్రులు తన్నీరు హరీశ్‌ రావు - జీ జగదీశ్‌ రెడ్డి ఈ క‌మిటీ సభ్యులుగా ఉంటారు. ఏపీ ప్రభుత్వం కూడా ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తుంది. గవర్నర్ సమన్వయకర్తగా రెండు రాష్ట్రాల ప్రతినిధులు ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతారు. ఏపీ భ‌వ‌నాల‌ను తెలంగాణ కోసం ఉప‌యోగించుకోవాల‌నే త‌న కోరిక‌ను నెర‌వేర్చే క్ర‌మంలో నిబంధ‌న‌లు అడ్డుగా మారిన‌ట్లు ఉండటంతో కేసీఆర్ ఈ క‌మిటీని రూపొందించిన‌ట్లు చెప్తున్నారు. కాగా నూత‌న స‌చివాల‌యం నిర్మించుకునేందుకు గాను ప్ర‌స్తుత స‌చివాల‌యాన్ని కూల్చివేసి ఏపీకి భ‌వ‌నాలను వాడుకొని ప‌రిపాల‌న చేయాల‌ని కొద్దికాలం క్రితం కేసీఆర్ భావించిన సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ ద్వారా రాయ‌బారం న‌డిపించి ఏపీ సీఎం చంద్ర‌బాబుతో ఈ ప్ర‌తిపాద‌న‌కు కేసీఆర్ ఓకే చేయించుకోగ‌లిగారు. అయితే ఏపీ మంత్రులు ఈ విష‌య‌లో అభ్యంత‌రం వ్యక్తం చేయ‌డంతో బాబు త‌న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకున్నారు. దీంతో త‌న కార్యాన్ని నెర‌వేర్చుకునేందుకు ఈ విధంగా కేసీఆర్ కొత్త‌ క‌మిటీ వేశార‌ని ప‌లువురు భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/