Begin typing your search above and press return to search.

ఆ లేడీ ఎమ్మెల్యే సీటుకే కేసీఆర్ ఎర్త్ పెట్టేశారా ?

By:  Tupaki Desk   |   27 Jan 2022 12:30 AM GMT
ఆ లేడీ ఎమ్మెల్యే సీటుకే కేసీఆర్ ఎర్త్ పెట్టేశారా ?
X
ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత సీటుకు ఎస‌రు పెట్టారా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యారా..? ఎందుకంటే స్వ‌యంగా కేసీఆరే ఆలేరు నుంచి పోటీ చేయ‌బోతున్నారా..? త‌ను సీఎం కావ‌డానికి కార‌ణ‌మైన గ‌జ్వేల్ ను వీడాల‌ని భావిస్తున్నారా..? ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప‌రిశీలిస్తే ఈ అనుమానాలే నిజ‌మ‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేదు.

రెండు రోజుల క్రితం కేసీఆర్ ఫౌంహౌస్ లో జ‌రిగిన ఒక భేటీ ఈ ఊహాగానాల‌కు తావిస్తోంది. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ఈ విష‌యం ప‌రోక్షంగా బ‌య‌ట పెట్టార‌ట కేసీఆర్‌. అభివృద్ధి ప‌నుల‌పై కొంత అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ట తొలుత‌. త‌న ప‌రిధిలోని అన్ని గ్రామాల్లో ఎలాంటి స‌మ‌స్య ఉండ‌కూడ‌ద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే వ్య‌క్తికి లైన్ క్లియ‌ర్ చేయాల‌ని అక్క‌డున్న నేత‌ల‌కు సూచించార‌ట కేసీఆర్‌. దీంతో అవాక్క‌వ‌డం నేత‌ల వంతైంది.

ఎమ్మెల్సీలు డాక్ట‌ర్ యాద‌వ‌రెడ్డి, వెంక‌ట్రామి రెడ్డి, అట‌వీ అభివృద్ది సంస్థ చైర్మ‌న్ వంటేరు ప్ర‌తాప రెడ్డి, క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు ఇత‌ర అధికారులు పాల్గొన్న ఈ స‌మావేశంలో కేసీఆరే త‌న నియోజ‌క‌వ‌ర్గ మార్పు గురించి ప‌రోక్షంగా ప్ర‌స్తావించ‌డంతో ఒక్క‌సారిగా నేత‌లు హ‌ఠాత్‌ప‌రిణామానికి లోన‌య్యార‌ట‌. ముఖ్యంగా ఎమ్మెల్సీ యాద‌వ రెడ్డితో.. మీరు ఎమ్మెల్సీ కావ‌డానికి వంటేరు ప్ర‌తాప్ రెడ్డి తీవ్రంగా కృషి చేశార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌నను గెలిపించి రుణం తీర్చుకోవాల‌ని సూచించార‌ట‌.

అయితే.. వేల కోట్ల రూపాయ‌ల‌తో రోల్ మోడ‌ల్ గా తీర్చిదిద్దుకుంటున్న గ‌జ్వేల్ ను కేసీఆర్ ఎందుకు వ‌ద‌లాల‌నుకుంటున్నారో మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేద‌ట‌. ఇదంతా రాజ‌కీయ వ్యూహంలో భాగ‌మేన‌ని.. అందుకే మ‌రో నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకుంటార‌ని కొంద‌రి విశ్లేష‌కుల అభిప్రాయం. ఆయ‌న కేంద్ర రాజ‌కీయాల వైపు దృష్టి సారించార‌ని.. రాష్ట్రంలో మూడోసారి టీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్‌ను సీఎం చేసి పార్ల‌మెంటుకు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మరికొంద‌రి ప‌రిశీల‌న‌. ఇవ‌న్నీ దూరాలోచ‌న‌లేన‌ని త‌మ అధినేత క‌చ్చితంగా గ‌జ్వేల్ నుంచే బ‌రిలో ఉంటార‌ని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

అయితే పార్టీలోని మ‌రికొన్ని వ‌ర్గాలు మాత్రం కేసీఆర్ ఈసారి ఆలేరు నుంచి పోటీ చేస్తార‌ని చెబుతున్నాయి. కేసీఆర్ మాన‌స పుత్రిక అయిన యాదాద్రి ఆలేరు ప‌రిధిలోకే వ‌స్తుండ‌డంతో ఆయ‌న ఇక్క‌డి నుంచే పోటీ చేసి యాదాద్రిని మ‌రింత అభివృద్ధి చేస్తార‌ని అనుకుంటున్నారు. దీని వ‌ల్ల ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో కూడా అడుగుపెట్టిన‌ట్లు ఉంటుంద‌ని.. ఇక్క‌డ బ‌లంగా ఉన్న బీజేపీని, కాంగ్రెస్ ను నిలువ‌రించొచ్చ‌ని భావిస్తున్నార‌ట‌. ఆలేరు నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న గొంగిడి సునీతను ఎంపీగా పోటీ చేయించాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. కేసీఆర్ స్వ‌యంగా స్ప‌ష్ట‌త ఇస్తే త‌ప్ప ఈ ఊహాగానాల‌కు ఇప్ప‌ట్లో తెర‌ప‌డేలా లేదు.