Begin typing your search above and press return to search.

న‌ల్గొండ బైపోల్స్‌పై కేసీఆర్ ప‌క్కా స్కెచ్‌!

By:  Tupaki Desk   |   4 Oct 2017 3:30 PM GMT
న‌ల్గొండ బైపోల్స్‌పై కేసీఆర్ ప‌క్కా స్కెచ్‌!
X
రాజ‌కీయాల్లో ఎత్తులే కాదు.. పై ఎత్తులు కూడా తెలిసి ఉండాలి. టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ఈ రెండు విష‌యాలూ కొట్టిన పిండి! ఆయ‌నకు రాజ‌కీయాల్లో త‌ల‌పండిన మేధావుల‌నే డింకీలు కొట్టించిన చ‌రిత్ర ఉంది. తాజాగా ఆయ‌న రాష్ట్రంలో త‌న బ‌లాన్ని - త‌న పార్టీ బ‌లాన్ని నిరూపించేందుకు రెడీ అయ్యారు. ఇది ఒక ఎత్తు. అదేస‌మ‌యంలో విప‌క్షాల నోరు నొక్కేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇది రెండో ఎత్తు. దీంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజ‌కీయాలు వేడెక్కాయి. విష‌యంలోకి వెళ్తే.. త‌న‌పైనా, త‌న ప్ర‌భుత్వంపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌కు తెర‌దీయ‌డం ద్వారా త‌న స‌త్తా చాటాల‌ని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

దీనికి న‌ల్ల‌గొండ‌ను ఎంచుకున్నారు. ఇక్క‌డ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ త‌న చెంత‌కే చేరిపోవ‌డంతో ఆయ‌న‌తో రాజీనామా చేయించి.. అక్క‌డి నుంచి మ‌రో అభ్య‌ర్థిని పెట్టి గెల‌వాల‌ని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అయితే, దీనిపై మొన్న‌టి వ‌ర‌కు బాగానే వార్త‌లు వ‌చ్చినా.. త‌ర్వాత కేసీఆర్ వెనక్కి తగ్గార‌ని మ‌రికొన్ని వార్త‌లు అందాయి. అయితే, తాజాగా.. నల్గొండకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.ఈ క్ర‌మంలోనే ఈ నెల చివరి నాటికి ఈ నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించనున్నారని సమాచారం. సమస్యల గుర్తింపు, పరిష్కారం, గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా, అభ్యర్థి ఎంపిక.. ఇలా ఈ అంశాలపై కేసీఆర్ వద్ద పక్కా ప్రణాళికతో ఉన్నారని సమాచారం. ఇందుకోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు - మండలాల వారీగా ఇంచార్జులను నిర్ణయించనున్నారని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకొని కేసీఆర్ ప‌క్కా స్కెచ్ సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు, నల్గొండ లోక్ సభకు ఉప ఎన్నిక వస్తే తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని రేవంత్ ప్రకటించారు. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ కూడా పోటీ చేసేందుకు సిద్ధం అవుతోంది. అయితే, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా? వ‌ద్దా అనేది నిర్ణ‌యించ‌లేదు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. సొంతంగానే బ‌రిలో దిగాల‌ని రేవంత్ వంటి వారు యోచిస్తున్నారు. ఏపీలో మంచి ఊపుమీదున్న పార్టీ.. తెలంగాణ‌లోనూ అదే ఊపు కొన‌సాగించేలా నంద్యాల ఫార్ములాను అమ‌లు చేసేలా వ్యూహం సిద్ధం చేయాల‌ని రేవంత్ అనుకుంటున్నాడ‌ట‌. మ‌రి ఏంజ రుగుతుందో చూడాలి.