Begin typing your search above and press return to search.

కేసీఆర్ ముంద‌స్తు గేమ్ ప్లాన్ ఇదేనట‌!

By:  Tupaki Desk   |   24 Aug 2018 2:30 PM GMT
కేసీఆర్ ముంద‌స్తు గేమ్ ప్లాన్ ఇదేనట‌!
X
తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయం వేడెక్కింది. మొన్న‌టివ‌ర‌కూ ఊహాగానాలుగా ఉన్న ముంద‌స్తు.. ఇప్పుడు రియాలిటీకి ద‌గ్గ‌ర అవుతోంది. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తే.. ముంద‌స్తుకు వెళ్లేందుకు కేసీఆర్ మాన‌సికంగా త‌యారైన‌ట్లుగా క‌నిపిస్తుంది.

కేసీఆర్ ఒకసారి ఫిక్స్ అయితే.. మ‌ళ్లీ దానిపై వెన‌క్కి త‌గ్గేది అన్న‌ట్లు ఉండ‌దు. అందులోకి ఒక‌టిని ప‌ది స‌ర్వే రిపోర్టులతో మాంచి ఊపు మీద ఉన్న ఆయ‌న‌.. ఈ ఏడాది చివ‌ర్లోనే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి తోడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారుతో పాటు.. మంత్రి కేటీఆర్.. ఎంపీ వినోద్‌.. ఇలా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన వారంతా ముంద‌స్తు ఎన్నిక‌ల ఏర్పాటుకు సంబంధించిన వ్యూహాల‌తోనూ..వివిధ వ‌ర్గాల ముఖ్యుల‌తో మాట్లాడుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ముంద‌స్తుకు వెళ్ల‌టానికి కేసీఆర్ ఎందుకు సానుకూలంగా మారారు? ఆయ‌న్ను ప్ర‌భావితం చేసిన అంశాలు ఏమిటి? ఇంత‌కూ ఆయ‌న గేమ్ ప్లాన్ ఏమిటి? అన్న‌ది చూస్తే.. ఆస‌క్తిక‌ర స‌మాధానాలు వస్తాయి.

ముంద‌స్తుకు కేసీఆర్ సిద్ధం కావ‌టానికి కార‌ణాల్ని చూస్తే..

1. మోదీ ప్రాభవం నానాటికీ తగ్గుతోంది. ఏప్రిల్‌ నాటికి ఆయనపై వ్యతిరేకత మరింత ప్రబలవచ్చు. అది కాంగ్రెస్‌ కు లాభిస్తే సార్వత్రిక ఎన్నికల్లో మనకు ఇబ్బంది కావొచ్చు. అందువల్ల అసెంబ్లీని విడగొట్టి ముందు ఎన్నికలకు వెళ్లడమే మంచిది

2. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత సఖ్యతగా వ్యవహరిస్తోంది. ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి వేళ‌.. బీజేపీకి టీఆర్ ఎస్‌ దగ్గరవుతోందని ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మ‌రోవైపు రాష్ట్రంలో ముస్లిం ఓటర్ల శాతం గణనీయంగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే విధంగా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వస్తే.. ముస్లిం ఓట్లను పూర్తిస్థాయిలో పొందడంలో టీఆర్ఎస్ కు ఇబ్బందులు వచ్చే అవ‌కాశం ఉంది. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకే ముంద‌స్తు దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

3. ఎన్నికలు విడివిడిగా జరిగి.. పార్లమెంట్‌ ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీఆర్ ఎస్‌ ప్రభుత్వం ఉంటే లోక్‌ సభ ఎన్నికలు నల్లేరుపై బండి నడకగా మారుతుంది. అలాగే.. సాధారణ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగి, ప్రజల్లో కొంత భిన్నమైన ఆలోచన వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీకి విడిగా ఎన్నికలు వస్తేనే.. తమ మద్దతు ఉంటుందనే సంకేతాన్ని మజ్లిస్ అధినేత నుంచి కేసీఆర్‌కు రావ‌ట‌మూ ముంద‌స్తు వైపు మొగ్గేలా చేసింది.

4. అసెంబ్లీకి, పార్లమెంటుకు విడివిడిగా.. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవడం సులువు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ.. మ‌జ్లిస్ తో ప‌రోక్షంగా ల‌బ్థి పొంద‌టం. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు మ‌రింత బలం పుంజుకునే వీలు. అదే స‌మ‌యంలో తాజా ఓట‌మితో రాష్ట్ర కాంగ్రెస్ మ‌రింత నిర్వీర్యం అవుతుంది. అదే స‌మ‌యంలో జ‌రిగే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్ని మ‌రింత తేలిక‌గా ఎదుర్కొనే వీలు.

5. జాతీయ స్థాయిలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగేనాటికి ఈ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే, అది కాంగ్రెస్‌ పార్టీకి లేదా ప్రతిపక్ష కూటమికి లాభం చేకూరటం ఖాయం. ప్ర‌జ‌ల మూడ్ మారుతుంది. అప్పుడు ప్ర‌భావితం చేయ‌టం క‌ష్టం. విడివిడిగా ఎన్నిక‌లు జ‌రిగితే.. ఆర్థిక మూలాలున్న టీఆర్ ఎస్ కు ఎన్నిక‌ల్ని ఎదుర్కోవ‌టం మ‌రింత సులువు అవుతుంది. ఐదేళ్లుగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ నేత‌లు కిందామీదా ప‌డే ప‌రిస్థితి. వారిని ఎన్ని తిప్ప‌లు పెడితే అంత‌లా ప్ర‌యోజ‌నం పొందొచ‌చు. వేర్వేరు ఎన్నిక‌లు వ‌స్తే.. అసెంబ్లీ ఎన్నిక‌లు రాష్ట్రంలోని అంశాల ప్రాతిప‌దిక‌నే జ‌రిగే వీలుంది. అది టీఆర్ఎస్ కు మేలు క‌లిగించే అంశం.