Begin typing your search above and press return to search.

కేసీఆర్ కేర్ ఎలాంటిదో ఆ ఫ్యామిలీ చేతల్లో చూపించారుగా..!

By:  Tupaki Desk   |   24 July 2020 2:30 AM GMT
కేసీఆర్ కేర్ ఎలాంటిదో ఆ ఫ్యామిలీ చేతల్లో చూపించారుగా..!
X
ఎవరికైనా వ్యక్తిగతంగా ఏదైనా హామీ ఇస్తే.. అందునా ఆ సందర్భంలో భావోద్వేగం ఉంటే దాన్ని పూర్తి చేసే వరకూ విశ్రమించకుండా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. ఆ మధ్య సరిహద్దుల్లో చైనా దుర్మార్గానికి వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం బాసటగా ఉంటుందని చెప్పటమే కాదు.. పలు హామీల్ని ఇవ్వటం తెలిసిందే.

బుధవారం ఒక్కరోజులోనే తానిచ్చిన హామీల్ని పూర్తి చేసేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ కు వారి కుటుంబాన్ని పిలిపించటమే కాదు.. వారికి ప్రభుత్వం ఇచ్చే మూడు ప్రభుత్వ స్థలాల్ని చూపించి ఒకటి ఎంపిక చేసుకోవాలని కోరారు. వారు కోరున్నట్లుగా బంజారాహిల్స్ లోని 711 గజాల స్థలాన్ని హైదరాబాద్ కలెక్టర్ చేతుల మీదుగా ఇచ్చారు.

సంతోష్ బాబు ఫ్యామిలీతో పాటు వచ్చిన 20 మందితో కలిసి కేసీఆర్ ప్రగతిభవన్ లోని తన నివాసంలో భోజనం చేశారు. అనంతరం సంతోష్ బాబు సతీమణి సంతోషికి ప్రభుత్వం ఉప కలెక్టర్ గా నియమిస్తూ ఉద్యోగాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని సీఎం కేసీఆర్ స్వయంగా అందజేశారు.

అంతేకాదు.. ఆమెకు అవసరమైన శిక్షణను ఇప్పించి.. ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని తన కార్యదర్శి స్మితా సభర్వాల్ ను కోరారు. సంతోష్ భాబు కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మరోసారి చెప్పారు. అంతేకాదు.. పోస్టింగ్ కూడా హైదరాబాద్.. ఆ పరిసర ప్రాంతాల్లోనే నియమించాలని ఉన్నతాధికారుల్ని కోరారు. ఇలా ఒకే రోజులో తానిచ్చిన హామీల్ని పూర్తి చేయటమే కాదు.. తాను కేర్ తీసుకుంటే పనులు ఎలా జరుగుతాయన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు. ఇలాంటివి ఆయనకు మాత్రమే సాధ్యమేమో?