Begin typing your search above and press return to search.

అంత సీనియర్ కే షాకిచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   31 Oct 2019 11:30 AM GMT
అంత సీనియర్ కే షాకిచ్చిన కేసీఆర్
X
పరపతి, ప్రజాభిమానం.. ఉంటేనే నాయకుడు అవుతాడు.. అలాంటి వాడికోసమే పార్టీలన్నీ కాపుకాస్తాయి.. ఆకర్షిస్తాయి. ఎంత సీనియర్ అయినా.. దగ్గరి బంధువైనా కేసీఆర్ దూరం పెడుతున్న వైనం ఇప్పుడు గులాబీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి తోపాటు ఈ దఫా మాజీ మంత్రులు చాలా మందిని కేసీఆర్ దూరం పెట్టారు. ప్రజల్లో గెలుపునే గీటురాయిగా తీసుకుంటున్నారు. ఈ పరిణామం గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది.

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవ్వడమంటే ఇదే.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రిగా.. గిరిజన నేతగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఆ నేత ఇప్పుడు తన నియోజకవర్గంలో కూడా ఆయన మాట చెల్లుబాటు కానీ దీనస్థితిని ఎదుర్కొంటున్నారట..

2014 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గం నుంచి గెలిచిన చందూలాల్ కేసీఆర్ అండతో ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎంతో సీనియర్ అయిన చందూలాల్ కు కేసీఆర్ అందలమెక్కించారు.అయితే ఐదేళ్లు తిరిగేసరికి ఆయన ట్రెయిన్ రివర్స్ అయ్యింది.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇచ్చినా చందూలాల్ గెలవలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క చేతిలో ములుగులో ఓడిపోయారు. చందూలాల్ పై కార్యకర్తలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక చందూలాల్ వల్ల పార్టీకి కూడా దెబ్బ అని గ్రహించిన టీఆర్ఎస్ అధిష్టానం తాజాగా ఆయన స్థానంలో కొత్త నాయకత్వాన్ని ప్రొత్సహించాలని డిసైడ్ అయ్యిందట..ఓ యువనేతను అక్కడ సిద్దం చేయడం చందూలాల్ ను టెన్షన్ కు గురిచేస్తోంది.

చందూలాల్ ఆరోగ్యం సహకరించడం లేదు. వృద్ధాప్యం వెంటాడుతోది. ఆయన కుమారుడిపై కూడా ములుగులో వ్యతిరేకత ఉందట.. కుటుంబానికే ప్రాధాన్యతనిచ్చి కేడర్ ను మరిచిన చందూలాల్ పై ఇప్పుడక్కడ అసమ్మతి రాజ్యమేలుతోంది.

దీంతో ఈ గిరిజన జిల్లాలో బలపడేందుకు టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ గా ఉన్న కుసుమ జగదీస్ ను తెరపైకి తీసుకొస్తోందట.. ఇక్కడ బలమైన కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కను ఎదుర్కోవడానికి వివాదరహితుడు, యువనేత కుసుమ జగదీష్ సరైన అభ్యర్థిని టీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దించుతోందట.. చందూలాల్, ఆయన కుమారుడిపై వ్యతిరేకత గులాబీ పార్టీ పుట్టి మునగకుండా అంత సీనియర్ అయిన చందూలాల్ ను సైతం టీఆర్ఎస్ పార్టీ పక్కనపెట్టిన వైనం ఇప్పుడు వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది