Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను అమావాస్య ఏం చేయ‌నుంది?

By:  Tupaki Desk   |   7 Oct 2018 6:19 AM GMT
కేసీఆర్ ను అమావాస్య ఏం చేయ‌నుంది?
X
జాత‌కాలు.. ముహుర్తాలు.. సెంటిమెంట్లు లాంటివి తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు చాలా ఎక్కువ‌. ఎక్క‌డిదాకానో ఎందుకు.. తొమ్మిది నెల‌ల ముందు త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకోవ‌టానికి.. విప‌క్ష నేత‌లు స‌వాలు విస‌ర‌టంతో సీఎం ప‌ద‌విని లెఫ్ట్ లెగ్ తో త‌న్ని మ‌రీ రాజీనామా చేసేసిన‌ట్లు చెబుతారు.

అదే నిజ‌మైతే.. ముహుర్తాలు చూసుకొని త‌న‌కు అదృష్ట సంఖ్య అయిన ఆరో తేదీన రాజీనామా చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అది కూడా.. తాను ఎంచుకున్న ముహుర్తానే. రాజీనామా ఇవ్వ‌టం మొద‌లు.. ఎన్నిక‌ల బ‌రిలో తాను దించే 105 మంది అభ్య‌ర్థుల జాబితాను సైతం ముహుర్తం ప్ర‌కార‌మే విడుద‌ల చేసిన కేసీఆర్ తీరును చూస్తే.. న‌మ్మ‌కాల‌కు ఆయ‌న ఇచ్చే ప్రాధాన్య‌త ఎంత‌న్న‌ది ఇట్టే అర్థం కాక మాన‌దు.

ఇంత‌లా ముహుర్తాల్ని న‌మ్మే కేసీఆర్ కు.. తాజాగా విడుద‌లైన ఎన్నిక‌ల షెడ్యూల్ వ్య‌వ‌హారం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే.. ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన పోలింగ్ డిసెంబ‌రు 7. అది కూడా అమావాస్య రోజున‌. తెలుగువారి సెంటిమెంట్ల ప్ర‌కారం అమావాస్య ఏ మాత్రం మంచిది కాద‌ని.. అది చెడు కాలంగా భావిస్తారు.

మ‌రి.. అలాంటి రోజున జ‌రుగుతున్న పోలింగ్ కేసీఆర్ కొంప ముంచుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. మ‌రి.. ఈ విష‌యం మీద పండితులు ఏమంటారా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. మ‌రోవైపు పోలింగ్ ఏ రోజు జ‌రిగినా.. అంతిమంగా ప‌లితాలు వెల్ల‌డ‌య్యే రోజే కీల‌క‌మ‌ని చెప్పేటోళ్లు లేక‌పోలేరు. ఒక‌వేళ అలా చూసిన‌ప‌క్షంలో ఫ‌లితాలు వెలువ‌డే డిసెంబ‌రు 11 కేసీఆర్ కు క‌లిసి వ‌స్తుందా? రాదా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

కేసీఆర్‌కు అదృష్ట‌సంఖ్య‌గా చెప్పే ఆరో తేదీని ఎన్నిక‌ల షెడ్యూల్‌కు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఇక‌.. పోలింగ్ జ‌రిగే డిసెంబ‌రు 7 సంగ‌తే చూస్తే.. ఆ రోజు అమావాస్య‌. ఇక‌.. ఫ‌లితాలు వెల‌వ‌డే డిసెంబ‌రు 11ను చూస్తే.. ఆ రోజు చ‌వితి. పోలింగ్ రోజున జేష్ఠ న‌క్ష‌త్రం ఉంద‌ని.. ఇది కేసీఆర్ జ‌న్మ న‌క్ష‌త్ర‌మైన అశ్లేష‌కు జ‌న్మ‌తార అవుతుంద‌ని చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో ఫ‌లితాలు వెలువ‌డే డిసెంబ‌రు 11న ఉత్త‌రాషాఢ న‌క్ష‌త్రం ఉంద‌ని.. అది కేసీఆర్‌కు క్షేమ‌తార అవుతుంద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన ఓటింగ్ రోజు క‌లిసి రాకున్నా.. ఫ‌లితాల రోజు కేసీఆర్‌కు క్షేమ‌తార‌గా ఉండ‌టంతో ఫ‌లితం ఆయ‌న‌కు కాసింత అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ఈ న‌మ్మ‌కాలు ఎంత‌వ‌ర‌కూ నిజ‌మ‌న్న‌ది డిసెంబ‌రు 11 మ‌ధ్యాహ్నానానికి కానీ ఒక కొలిక్కి రావ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.