Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు కొత్త శాఖ..ఆ కేంద్రమంత్రిపై పొలికేక

By:  Tupaki Desk   |   31 Jan 2016 5:26 AM GMT
కేటీఆర్ కు కొత్త శాఖ..ఆ కేంద్రమంత్రిపై పొలికేక
X
జీహెచ్‌ ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ప్రసంగిస్తూ తెలంగాణ సీఎం-టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కొత్త విషయం వెల్లడించారు. పరేడ్ గ్రౌండ్‌ కు ఇంత మంది జనం వచ్చి ఇంత సేపు కూర్చున్నరంటేనే తనకు టీఆర్‌ ఎస్ గెలుపు ఖాయమైపోయినట్టు తెలుస్తుందని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి టీఆర్‌ ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తనయుడు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు కేటీఆర్ నగరంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారని వివరించారు. అందుకే హైదరాబాద్ నగరాభివృద్ధి బాధ్యతను కేటీఆర్ చేతిలో పెడతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ తన చేతిలో ఉందని త్వరలో ఆ శాఖ బాధ్యతలను కేటీఆర్ అప్పగిస్తానని చెప్పారు.

ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని తెలిపారు. తాను ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించానని తెలిపారు. తెలంగాణ ప్రకటన వెలువడగానే ఆంధ్రా నాయకులు అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌ తో కూడిన తెలంగాణ కావాలని తాము కరాఖండిగా చెప్పామన్నారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ వంటిదని వ్యాఖ్యానించారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నగర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో జరుగుతోన్న ముఖ్యమైన ఎన్నికలని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను నాశనం చేసింది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలని అందుకే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.