Begin typing your search above and press return to search.

ఆర్టీసీ కార్మికుల‌కు అదిరిపోయే ట్విస్టిచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   21 Nov 2019 7:54 AM GMT
ఆర్టీసీ కార్మికుల‌కు అదిరిపోయే ట్విస్టిచ్చిన కేసీఆర్
X
తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆర్టీసీ సమ్మెపై విచారణ చేపట్టాలని హైకోర్ట్ లేబర్ కోర్టుకు సూచించ‌డం, లేబర్ కోర్ట్ లో తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసంతో అక్టోబర్ 4 ముందు ఉన్న పరిస్థితులు ఆర్టీసీలో ఉంటే వెంటనే తాము సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఎలాంటి షరతులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని ఆయ‌న‌ కోరారు. దీంతో స‌హ‌జంగానే, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆర్టీసీ యాజ‌మాన్యం వైఖ‌రిపై అంద‌రి దృష్టి ప‌డింది. అయితే, కేసీఆర్ వారికి ఊహించ‌ని షాక్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ జేఏసీ విలేక‌రుల స‌మావేశం, వారు చేసిన ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో...సీఎం కేసీఆర్ అధికారులతో ఆరా తీసినట్లు సమాచారం. సమ్మె ఇంత దూరం వచ్చాక షరతులు లేకుండా ఎలా డ్యూటీలోకి తీసుకుంటారనే రీతిలో కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రతి కార్మికుడు లిఖితపూర్వకంగా షరతులను ఆమోదించాల్సి ఉంటుందని కేసీఆర్‌ అన్నట్లు స‌మాచారం.'సమ్మె చేయడం వాళ్ల ఇష్టమే. డ్యూటీలో ఎలా చేరాలో కూడా వాళ్లే చెప్తారా?' అని సీఎం అన్నట్టు తెలిసింది.

కాగా, ఆర్టీసీ కార్మికుల విష‌యంలో...ప్ర‌భుత్వం క‌ఠినంగానే ఉంటుంద‌ని స‌మాచారం. ఇక నుంచి సమ్మె చేయబోమని, సమ్మె కాలానికి జీతం అడగబోమని, సంస్థను విలీనం చేయాలంటూ కోరబోమని, అదే సమయంలో ఆర్థిక పరమైన అంశాలను కూడా భవిష్యత్తులో అడగబోమనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ష‌ర‌తులు విధించనున్నట్లు తెలిసింది. ఇదిలాఉండ‌గా, ఆర్టీసీ కార్మికుల అంశంపై గురువారం సీఎం కేసీఆర్ సమీక్షించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.