Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీని రిసీవ్ చేసుకునే తలసానికి ఈసారి ఇలాంటి షాకేంటి?

By:  Tupaki Desk   |   18 Jan 2023 8:49 AM GMT
ప్రధాని మోడీని రిసీవ్ చేసుకునే తలసానికి ఈసారి ఇలాంటి షాకేంటి?
X
తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా పలువురు ఉన్నా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ లెక్కనే వేరుగా ఉంటుందని చెబుతారు. ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో తలసాని లెక్కనే వేరు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వంగా కొలువు తీరిన కేసీఆర్ సర్కారు.. అప్పట్లో విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తలసానిని మంత్రిగా చేయటం తెలిసిందే. పార్టీ మారకుండానే ఆయన మంత్రి బాధ్యతల్ని చేపట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాటలు తగ్గిపోయిన నేపథ్యంలో..

మోడీ మాష్టారు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా రిసీవ్ చేసుకోవటానికి మంత్రి తలసానిని పంపేవారు. అలా ఒకసారి కాకుండా మూడుసార్లు అలాంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. తన మంత్రివర్గంలో పలువురు మంత్రులు ఉన్నా.. మరెవరికీ దక్కని అవకాశాన్ని తలసానికి అందించారు. తాను మంత్రిగా వ్యవహరిస్తూ.. ప్రోటోకాల్ లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని రిసీవ్ చేసుకునే వీలు దక్కింది. అలాంటి తలసానికి తాజాగా మాత్రం భలే షాకిచ్చారు కేసీఆర్ అన్న మాటను చెబుతున్నారు.

ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకునే మంత్రి తలసానికి.. తాజాగా ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరవుతున్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరిలో ఢిల్లీ.. పంజాబ్.. కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే..

ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఢిల్లీ.. పంజాబ్ సీఎంలను రిసీవ్ చేసుకోవటానికి.. వారికి స్వాగతం పలకటానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళితే.. కేరళ ముఖ్యమంత్రి విజయన్ ను రిసీవ్ చేసుకునే అవకాశాన్నిమంత్రి ప్రశాంత్ రెడ్డి సొంతం చేసుకున్నారు.

ఇక.. తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయానికి వస్తే ఆయనకు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను రిసీవ్ చేసుకోవటానికి అవకాశాన్ని ఇచ్చారు. ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకునే మంత్రి తలసానిని ఈసారి అఖిలేశ్ కు స్వాగతం పలకటానికి అవకాశాన్ని ఇవ్వటం ఏమిటన్న మాటకు.. ఇద్దరు నేతలు యాదవులు కావటంతో.. కెమిస్ట్రీ మరింత బాగా వర్కువుట్ అవుతుందన్న ఉద్దేశంతోనే తలసానికి స్వాగతం పలికే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. కేసీఆర్ లెక్కలే వేరుగా ఉంటాయనటానికి ఇదో నిదర్శనంగా చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.