Begin typing your search above and press return to search.

అడక్కుండానే వరాలిచ్చే దేవుడా కేసీఆర్?

By:  Tupaki Desk   |   16 Oct 2015 5:19 AM GMT
అడక్కుండానే వరాలిచ్చే దేవుడా కేసీఆర్?
X
రాజకీయ నేతల తీరు వేరుగా ఉంటుంది. తమ మనసుకు నచ్చింది చేసేందుకు ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆశా కార్యకర్తలు తమ డిమాండ్లు తీర్చాలంటూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. అయినా పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర సర్కారు.. తాజాగా అడగకుండానే వరాన్ని ఇచ్చేసి ఆశ్చర్యపర్చింది.

గ్రేటర్ పరిధిలోని ఇళ్లున్న వారు.. ఏడాదికి రూ.1200 ఆస్తిపన్ను మాత్రమే కట్టే వారికి.. అంత మొత్తాన్ని ఇకపై కట్టాల్సిన అవసరం లేదని కేవలం రూ.101 కడితే చాలంటూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇవాల్టి రోజున పన్నుల భారమే తప్పించి.. వరాలు ఇచ్చే పరిస్థితి లేకున్నా.. తెలంగాణ సర్కారు అందుకు భిన్నంగా భారీ వరం ఇచ్చేసి ఆశ్చర్యపర్చింది.

గ్రేటర్ వాసుల మీద ఎందుకింత ప్రేమ అంటే.. దానికి ఉండే లెక్కలు దానికున్నాయి మరి. రాజకీయ నేతలు.. అందులోకి అధికారపక్షం ఒక నిర్ణయం తీసుకుందంటే దాని ముందు.. వెనుక చాలానే కథ ఉంటుంది. అందులోకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నేత ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆషామాషీగా ఉండదు.

తెలంగాణ సర్కారు తాజాగా తీసుకున్న ఆస్తిపన్ను తగ్గింపు కారణంగా గ్రేటర్ ఆదాయం ఏడాదికి రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు కోల్పోనుంది. ఇంత భారీ మొత్తాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఏమిటంటే.. సమీప భవిష్యత్తులో ముంచుకొస్తున్న గ్రేటర్ ఎన్నికలుగా చెప్పాలి. తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 5 లక్షల మంది గ్రేటర్ వాసులు లబ్థి పొందే వీలుంది. అంటే.. 5 లక్షల కుటుంబాలు అంటే.. సరాసరిన ఇంటికి ఇద్దరు చొప్పున చూసుకున్నా 10 లక్షల మంది ప్రత్యక్షంగా ఈ వర ఫలం అందనుంది.

అలివికానట్లుగా తయారైన గ్రేటర్ అధికార దండాన్ని అందుకోవటానికి ఇలాంటివి రానున్న రోజుల్లో మరెన్ని వరాలు ప్రకటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిత్రమైన అంశం ఏమిటంటే.. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చమని ఆశా కార్యకర్తలు ఓవైపు నెత్తి నోరు కొట్టుకుంటున్నా పెద్దగా పట్టించుకోని తెలంగాణ సర్కారు.. గ్రేటర్ లోని ఇళ్ల యజమానుల (ఏడాదికి రూ.1200 ఆస్తి పన్ను కట్టే వారు మాత్రమే) కు మాత్రం అడగకుండానే వరం ఇచ్చేసి ఆశ్చర్యపరిచింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అడక్కుండానే వరాలిచ్చే దేవుడిలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మారినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.