Begin typing your search above and press return to search.

ఓడిపోయినోళ్లకు కేసీఆర్ లక్కీఛాన్స్

By:  Tupaki Desk   |   16 April 2019 4:43 AM GMT
ఓడిపోయినోళ్లకు కేసీఆర్ లక్కీఛాన్స్
X
కేసీఆర్ అందరినీ సంతృప్తి పరుస్తున్నాడు. ఓడిపోయినోళ్లకు కొత్త పదవుల పందేరం మొదలు పెట్టాడు. ఎవ్వరినీ నొచ్చుకోకుండా ముందుకెళ్తున్నాడు. ఇందుకోసం పెద్ద ప్లానే వేశాడు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ అంతకుమించిన పదవుల పందేరానికి రెడీ అయ్యారు. ఇది ఇప్పుడు గులాబీ శ్రేణులను ఉత్తేజపరుస్తోంది.

గత అక్టోబర్‌ నుంచి తెలంగాణలో ఎన్నికల జాతర సాగుతోంది. డిసెంబర్‌ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. జనవరిలో సర్పంచ్‌ ఎన్నికలు జరిగాయి. ఇక మొన్నటి వరకు సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. తాజాగా పరిషత్‌ ఎన్నికలకు రాష్ట్రం రెడీ అవుతోంది. అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల కాకున్నా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంతో పరిషత్‌ ఎన్నికలు ఇక ఖాయమేనన్న సంకేతాలు వెలువడ్డాయి.

ప్రగతిభవన్‌ లో నిర్వహించిన టీఆర్‌ ఎస్‌ పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బాధ్యతతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నామన్నారు. ప్రతీ జడ్పీటీసీ అభ్యర్థిని ఎమ్మెల్యే ఎంపిక చేస్తారని, ఆయా జిల్లా మంత్రి అభ్యర్థిని ఫైనల్‌ చేస్తారన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు.

* ఓడిపోయిన ఎమ్మెల్యేలకు అవకాశం..
గత డిసెంబర్‌ ఎన్నికల్లో పరాజయం చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులకు టీఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరో అవకాశం ఇచ్చారు. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన కోవ లక్ష్మిని ఆ జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించారు. అలాగే మంథనిలో పోటీలో నిలబడి పరాజయం చెందిన పుట్టమధుకు పెద్దపల్లి జడ్పీచైర్మన్‌ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. ఇప్పటి వరకు టికెట్‌ దక్కనివారికీ కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు.

* కొత్తగా చేరిన వారికీ అవకాశాలు..
టీఆర్‌ ఎస్‌ లోకి ఎంత మంది వచ్చినా చేర్చుకుంటామని ఇదివరకే చెప్పిన కేసీఆర్‌ పార్టీలో ఉన్నవారందరికీ న్యాయం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తామన్నారు. అలాగే నామినేటెడ్‌ పదవుల్లో కూడా ఎన్నో అవకాశాలుంటాయని హామి ఇచ్చారు. ఇక 2024 నాటినికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని, ఆ సమయంలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు.

* అందరినీ కలుపుకుపోవాలి..
పార్టీలో కిందిస్థాయి నాయకులను చిన్నచూపు చూడొద్దని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు కేసీఆర్‌ సూచించారు. కార్యకర్తలతోనే పార్టీకి బలం ఉంటుందని వారిని ఆదరించినప్పుడే పార్టీ అభివృద్ధి దశలో వెళ్తుందన్నారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో పదవులున్నాయని, త్వరలో పార్లమెంట్‌ కార్యదర్శుల పోస్టులకు కూడా పార్టీ పరంగా న్యాయం చేస్తామన్నారు.

ఇలా కేసీఆర్ టీఆర్ ఎస్ నమ్మి వచ్చిన వారందరినీ సంతృప్తి పరిచే ఎత్తుగడను ప్రస్తుతానికి వేశాడు. ఇది గులాబీ శ్రేణులను సంతృప్తి పరుస్తోంది.