Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ ‘కొండా’కు కేసీఆర్ షాక్

By:  Tupaki Desk   |   10 April 2019 9:29 AM GMT
ఎన్నికల వేళ ‘కొండా’కు కేసీఆర్ షాక్
X
కొండా విశ్వేశ్వరరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడు.. ఈయన తన ఎన్నికల అఫిడవిట్ లోనే తన ఆస్తులు 900 కోట్లకు పైగా చూపించాడు. ఇక బయట ఎంత ఉంటాయో లెక్కలేసుకోవచ్చు. మొన్నటి వరకు టీఆర్ ఎస్ లో ఉన్నా కొండా ఆ తర్వాత కేసీఆర్ వైఖరి నచ్చక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ మారారు. ఇప్పుడు చేవెళ్ల లోక్ సభ నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీచేస్తున్నారు.

అపర కుభేరుడు కావడంతో చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని డబ్బు, పరపతి ఉపయోగించి విస్తృతంగా దూసుకెళుతున్నారు. రేపే పొలింగ్ కావడంతో చేవెళ్లలో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పారుతోంది. దీంతో దీన్ని ఎలాగైనా అరికట్టాలని కొండా విశ్వేశ్వరరెడ్డికి చెక్ పెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేశారు.

అనుకున్నట్టే చేవెళ్ల లో కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం పనిచేస్తున్న సందీప్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎస్ ఎల్ఎన్ టవర్స్ లో సందీప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళవారం రాత్రి అతడిని ఐటీ అధికారులకు అప్పగించారు. వారు విచారించినట్టు సమాచారం.

సందీప్ రెడ్డి ఇప్పటికే రూ.15కోట్లను పంచినట్టు పోలీసులు, ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. సందీప్ రెడ్డి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. అంతేకాదు.. కొండాకు సంబంధించిన కీలకపత్రాలు, కోడ్ పద్ధతిలో రాసున్న కాగితాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని దాన్ని డీకొడ్ చేస్తున్నారట.. మూడు ల్యాప్ టాప్ లో ఎన్నికలకు డబ్బు పంపిణీపై వివరాలున్నాయట..

ఇలా ఎన్నికల వేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరుఫున అన్నీ తానై డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న అనుమానంతో సందీప్ రెడ్డిని టార్గెట్ చేసి తెలంగాణ సర్కార్, కేసీఆర్ చర్యలకు దిగడం కొండాను షాక్ కు గురిచేసింది. ఎంత డబ్బున్నా అధికారంలో ఉన్న వాళ్ల ముందు దిగదిడుపేనన్న సంకేతాలను కేసీఆర్ ఈ దెబ్బతో ఇచ్చినట్టైంది. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటున్న కొండాకు ఎన్నికల వేళ ఇదో పెద్ద ఎదురుదెబ్బగా మారింది.