Begin typing your search above and press return to search.

కేసీఆర్ మార్కు పాలిటిక్స్‌!..ఆ ఇద్ద‌రికీ షాకే!

By:  Tupaki Desk   |   28 Jun 2018 7:32 AM GMT
కేసీఆర్ మార్కు పాలిటిక్స్‌!..ఆ ఇద్ద‌రికీ షాకే!
X
కొత్త రాష్ట్రం తెలంగాణ‌లో ఇప్పుడు అంతా ముంద‌స్తు ఎన్నిక‌ల గురించే పెద్ద పెద్ద చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు తిరుగులేద‌ని - వంద సీట్ల‌ను అవ‌లీల‌గా గెలిచేస్తామ‌ని ఓ అంచనాకు వ‌చ్చేసిన అధికార టీఆర్ ఎస్... ముంద‌స్తు ఎన్నికల‌కు సిద్ధ‌మేనంటూ విప‌క్షాల‌కు స‌వాల్ విసిరింది. ఈ స‌వాల్ విసిరింది టీఆర్ ఎస్‌ కు చెందిన ఏ చోటా మోటా నేత‌నో కాదు... సాక్షాత్తు ఆ పార్టీ అధినేత‌ - రాష్ట్ర సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావే. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నిక‌లు ఎప్పుడైనా జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా కేంద్రంలోని ఎన్డీఏ స‌ర్కారును నిర్ణీత కాల ప‌రిమితి కంటే ముందుగానే డిజాల్వ్ చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిపోవాల‌న్న కోణంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భావిస్తున్నారు. తొలుత డిసెంబ‌ర్‌ లో ఎన్నిక‌ల‌కు బీజేపీ సిద్ధ‌ప‌డుతోంద‌న్న వాద‌న వినిపించ‌గా, ఇప్పుడు ఏకంగా అక్టోబ‌ర్‌ లోనే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మోదీ స‌న్నాహాలు చేస్తున్నార‌న్న కొత్త పుకారు తెర‌పైకి వ‌చ్చింది. జాతీయ రాజ‌కీయాల్లో దీనిపై చాలా వేగంగా మారుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న తెలంగాణ ప్ర‌జ‌లు... సీఎం కేసీఆర్ కూడా లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హించినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న భావ‌న‌తో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైతే... తాము కూడా రెడీ అంటూ విప‌క్షాలు కూడా ఎన్నిక‌ల‌కు స‌ర్వ‌స‌న్న‌ద్ధంగానే ఉన్న‌ట్లుగా పేర్కొన్నాయి. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫీవ‌ర్ బాగానే పెరిగిపోయింది. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే నేత‌లు కూడా త‌మకు అనుకూలంగా ఉన్న సీట్ల‌పై క‌ర్చీఫ్‌ లు వేసుకునే ప‌నిలో ప‌డ్డారు. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ ఈ త‌ర‌హా య‌త్నాలు ఊపందుకున్నాయి. మిగిలిన పార్టీల ప‌రిస్థితి ఎలా ఉన్నా... అధికార టీఆర్ ఎస్ కు చెందిన నేత‌ల ప‌రిస్థితి మాత్రం చాలా ఆస‌క్తిక‌రంగా మారింద‌న్న వాద‌న వినిపిస్తోంది. టీఆర్ ఎస్‌ లోనూ చోటా మోటా నేత‌ల మాట అటు ప‌క్క‌న పెడితే కీల‌క నేత‌ల విష‌యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ త‌రహా వార్త‌ల్లో ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆకర్షించిన వార్త స్టేష‌న్ ఘ‌న్‌ పూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌దే.

అయినా ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఉన్న ప్రాముఖ్య‌త ఏమిటంటే... ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ అయిన‌ప్ప‌టికీ... ఇక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టి. రాజ‌య్య... కేసీఆర్ కేబినెట్ లో కీల‌క మంత్రిగానే కాకుండా తెలంగాణ‌కు తొలి డిప్యూటీ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల‌తో రాజ‌య్య‌ను కేసీఆర్ బ‌య‌ట‌కు పంపేశారు. తెలంగాణ‌కు తొలి డిప్యూటీ సీఎం అయిన రాజ‌య్య ఇప్పుడు కేవ‌లం స్టేష‌న్ ఘ‌న్‌ పూర్ ఎమ్మెల్యే మాత్ర‌మే. అయితే రాజ‌య్య స్థానంలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికే చెందిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్ క‌డియం శ్రీ‌హ‌రిని కేసీఆర్ డిప్యూటీ సీఎంగా నియ‌మించుకున్నారు. శ్రీ‌హ‌రి కూడా గ‌తంలో స్టేష‌న్ ఘ‌న్‌ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్టేష‌న్ ఘ‌న్‌ పూర్ నుంచి తాను పోటీ చేస్తానంటే... కాదు తానే పోటీ చేస్తానంటూ అటు రాజయ్య‌తో పాటు ఇటు శ్రీ‌హ‌రి కూడా ఎవ‌రి స్థాయిలో వారు ప్ర‌క‌టన‌లిచ్చేసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో చాలా వైల్డ్‌ గా ఎంట్రీ ఇచ్చిన ప్రతాప్ అనే వ్య‌క్తి ఏకంగా ఓ డిప్యూటీ సీఎం - మ‌రో మాజీ డిప్యూటీ సీఎంల నుంచి ఈ సీటును ఎగుర‌వేసుకుపోయార‌ట‌. అయినా ఆ కొత్త నేత‌కు ఇదెలా సాధ్య‌మైంద‌న్న విష‌యాన్ని ఆరా తీస్తే.. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆరే ఆ కొత్త వ్య‌క్తికి స్టేష‌న్ ఘ‌న్‌ పూర్‌ పై హామీ ఇచ్చేశారట‌. అంత‌టితో ఆగ‌కుండా ఇటు క‌డియంతో పాటు అటు రాజ‌య్య‌ను కూడా పిలిచి స్టేష‌న్ ఘ‌న్‌ పూర్‌ పై ఆశ‌లు వ‌దిలేసుకోవాల‌ని, కొత్త స్థానాల‌ను వెతుక్కోవాల‌ని ఆదేశాలు జారీ చేశార‌ట‌. మొత్తంగా కేసీఆర్ మార్కు రాజ‌కీయంతో డిప్యూటీ సీఎంగా ఉన్న శ్రీ‌హ‌రి - మాజీ డిప్యూటీ సీఎం అయిన రాజ‌య్య ఏం చేయాలో పాలుపోక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.