Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు బొగ్గు స్కాం లెక్క చెప్పిన కోమటిరెడ్డి

By:  Tupaki Desk   |   25 April 2022 7:30 AM GMT
కేసీఆర్ సర్కారు బొగ్గు స్కాం లెక్క చెప్పిన కోమటిరెడ్డి
X
కాంగ్రెస్ పార్టీ గురించి ఒక జోక్ తరచూ వినిపిస్తూ ఉంటుంది. వారిని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే.. వారిలో ఎవరు ఎదుగుతున్నా.. మరొకొరు నిర్దాక్షిణ్యంగా కిందకు లాగేస్తారు. అది కుదరకుంటే ఏదో ఒకటి చేసి.. వారు పైకి రాకుండా మాత్రం విజయవంతంగా అడ్డుకుంటారు. అలాంటి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ఏముందన్న మాట కొందరు రాజకీయ నేతల నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే కాంగ్రెస్ నేతల తీరు ఉందని చెప్పక తప్పదు.

ఇన్ని లోపాలు ఉన్న కాంగ్రెస్ లోనూ కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. పోరాట పటిమ విషయంలో ఆ పార్టీ తర్వాతే ఎవరైనా. ఐకమత్యంగా ఉందాం.. గ్రూపులు కట్టొద్దు.. అధికారంలోకి రావటమే తప్పించి మరింకేమీ ప్లాన్ లేదని ఒకసారి డిసైడ్ అయితే.. ఆ తర్వాత నుంచి పార్టీలో చోటు చేసుకునే పరిణామాలు సినిమాటిక్ గా ఉంటాయి. మొన్నటికి మొన్న ఢిల్లీకి టీ కాంగ్రెస్ ముఖ్యనేతల్ని పిలిపించుకొని దిశానిర్దేశం చేసిన తర్వాత నుంచి అసమ్మతి గోల కాస్త తగ్గిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా టీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్లలో ఒకరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలపై మాట్లాడారు. అన్నింటికి మించి కేసీఆర్ సర్కారు మీద తరచూ వినిపించే బొగ్గు స్కాం మీద ఆయన పలు విషయాల్ని మాట్లాడారు. అసలు బొగ్గు స్కాం ఏమిటి? అందులో కేసీఆర్ సర్కార్ రోల్ ఏంటి? అన్న దానిపై ఆయన మాటల్లోనే చెబితే..

"ఒడిసాలోని నైనీ కోల్‌ బ్లాక్‌ను కేంద్రం సింగరేణికి కేటాయించింది. అక్కడ మనం మైనింగ్‌ అభివృద్ధి కోసం టెండర్లు పిలిచాం. టెండర్‌ పిలిచేటపుడు ప్రీ బిడ్‌ సమావేశంలో జాయింట్‌ వెంచర్‌కు అనుమతి లేదన్నది తొలి షరతు. మైనింగ్‌ డెవల్‌పమెంట్‌ కంపెనీల వారే అర్హులని రెండో షరతు పెట్టారు. అప్పుడు అదానీ, ఆంబే, ఎస్‌ఎల్‌ కంపెనీలు తప్ప ఎవరూ లేరు. ఈ ముగ్గురిలో అదానీకి వచ్చేలా చూసేందుకు కేసీఆర్‌, సింగరేణి సీఎండీ అప్పటికే నిర్ణయించారు" అని పేర్కొన్నారు.

ఈ స్కాం వివరాల్ని మరిన్ని వివరిస్తూ.. "ఈ టెండర్ పేరుకే అదానీకి టెండర్‌ దక్కుతుంది. అందులో ఫైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్ట్‌నర్‌గా ప్రతిమా ఇన్‌ఫ్రా చేరుతుంది. ఇంతకీ ఈ కంపెనీ ఎవరిదంటే మఖ్యమంత్రి కేసీఆర్‌ బావది కానీ బావమరిది కాని. నిజానికి ఈ టెండరే చెల్లదు. ఎందుకంటే.. సీఎండీగా శ్రీధర్ కు ఎనిమిదో ఏడాది కొనసాగే వీల్లేదు. అంతేకాదు.. ఈ సంస్థ జాయింట్ వెంచర్. అంటే తొలి షరతునే ఉల్లంఘించినట్లు. ఇదో పెద్ద స్కాం.

దాదాపు రూ.30 నుంచి రూ.40వేల కోట్ల వరకు ఉంటుంది. ఈ స్కాం ఎన్డీయే కొంప ముంచుతుంది" అని ప్రధాని మోడీకి.. బొగ్గు శాఖా మంత్రికి వివరించాం. సుప్రీంకోర్టులో పిల్ వేయటానికి లాయర్ ను మాట్లాడినట్లు చెప్పారు. ఎంతకూ అర్థం కాని బొగ్గు స్కాంను ఇట్టే అర్థమయ్యేలా కోమటిరెడ్డి వివరించి చెప్పిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.