Begin typing your search above and press return to search.

టీచర్లకు భారీ షాకిచ్చిన కేసీఆర్ సర్కారు

By:  Tupaki Desk   |   16 Sep 2022 4:46 AM GMT
టీచర్లకు భారీ షాకిచ్చిన కేసీఆర్ సర్కారు
X
కొత్త రూల్ తీసుకొచ్చింది కేసీఆర్ సర్కారు. ఇప్పటివరకు లేని ఈ కొత్త నిబంధన టీచర్లకు తలనొప్పిగా మారుతుందని చెప్పక తప్పదు. క్లాస్ రూంలో సెల్ మోగితే పిల్లలకు ఇబ్బందే అయినప్పటికీ.. తమతో క్లాస్ కు తీసుకెళ్లే సెల్ ఫోన్ కు ఆంక్షలు పెట్టేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు. ఇక నుంచి క్లాస్ రూంలోకి టీచర్లు ఎవరూ సెల్ ఫోన్ వాడొద్దంటూ స్పష్టం చేసింది.

ఇదే రూల్ టీచర్లతో పాటు విద్యార్థులకు సైతం వర్తిస్తుందనిస్పష్టం చేసింది. టీచర్లు.. పిల్లలు ఎవరూ క్లాస్ రూంలోకి సెల్ ఫోన్ తీసుకురాకూడదని పేర్కొంటూ విద్యా కమిషనర్ దేవసేన స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేశారు.

ఈ నిబంధనను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలు చేయనున్నారు. కేజీబీవీలు.. టీఎస్ మోడల్ స్కూళ్లకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

సెల్ ఫోన్ లేకుండా గడిచేదెలా? ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని ఇట్టే తెలుసుకునే వెసులుబాటును సెల్ ఇస్తుంది కదా? అన్న సందేహానికి సమాధానాన్ని ఇచ్చేశారు. క్లాస్ రూంలోకి వెళ్లే ముందు టీచర్లు తమ సెల్ ఫోన్లను హెడ్మాష్టర్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తాము జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వును పక్కాగా పాటించాలని.. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చేశారు.

మరి.. ఈ కొత్త రూల్ పై ఉపాధ్యాయులు ఎలా రియాక్టు అవుతారో చూడాలి. క్లాస్ రూంలోకి వెళ్లే వేళలో.. హెడ్మాస్టర్ కు సెల్ ఫోన్ అప్పజెప్పే కన్నా.. ప్రతి స్కూళ్లో లాకర్లు ఏర్పాటు చేసి.. అందులో దాచేసుకొని క్లాస్ కు వెళ్లేలా ఆలోచన చేస్తే.. కొత్త వివాదాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుంది.

ఇంతకాలం తమతో కూడా ఉన్న సెల్ ఫోన్.. పిల్లలకు పాఠాలు చెప్పే వేళలో వెంట లేని వైనం టీచర్లకు ఇబ్బందిని కలిగిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు టీచర్లు పిల్లలకు డిస్ట్రబ్ కాకూడదని.. క్లాస్ రూంలో ఫోన్ ను సైలెంట్ మోడ్ లో పెడుతున్నారని.. తాజా ఉత్తర్వులు టీచర్లను ఇబ్బంది పెట్టేందుకే తప్పించి మరొకటి కాదన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.