Begin typing your search above and press return to search.

మునుగోడు పోలింగ్ ముందురోజు.. గిఫ్టు ఇచ్చిన కేసీఆర్ సర్కార్?

By:  Tupaki Desk   |   3 Nov 2022 4:26 AM GMT
మునుగోడు పోలింగ్ ముందురోజు.. గిఫ్టు ఇచ్చిన కేసీఆర్ సర్కార్?
X
పదిహేనేళ్లుగా సా..గుతున్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్.. యూఎల్ సీ సమస్యలకు కేసీఆర్ సర్కారు అనూహ్యంగా స్పందించింది. తెర వెనుక కొంత కాలంగా జరుగుతున్న కసరత్తును.. సరైన సమయంలో బయటకు తీసి.. గురి చూసి వదిలిన బాణం మాదిరి మునుగోడు ఉప పోరుకు ఒక్కరోజు ముందు ఓటర్ల మీదకు సమ్మోహనాస్త్రాన్ని సందించిందన్న మాట వినిపిస్తోంది. మునుగోడు ఉప పోరులో అత్యధిక ఓటర్లు ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నారన్న లెక్కలు ఇప్పటికే వినిపిస్తున్న వేళ.. సదరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇంతకాలం రిజిస్ట్రేషన్లు చేసుకోవటానికి వీల్లేని భూములకు పరిష్కారం కల్పిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు నియోజకవర్గాల పరిధిలోని కొన్ని సర్వే నెంబర్లను 22ఏ జాబితాలో చేర్చారు. దీని అర్థం.. ఆ భూములు నిషేధిత భూములుగా వ్యవహరిస్తారు. ఈ భూములకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఉండవు. దీంతో.. ఆ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తీసివేయాలన్న డిమాండ్ ను ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నది లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా దీనిపై స్పందించిన రాష్ట్ర సర్కారు జీవో 118 ద్వారా నామమాత్రపు రుసుముతో క్రమబద్ధీకరిస్తామంటూ జీవోను విడుదల చేశారు. గత నెల 28న విడుదలైన ఈ ప్రభుత్వ జీవో 118 ప్రతిని ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లకు ప్రజల హర్షధ్వానాల మధ్య అందజేశారు. దీనికి సంబంధించిన కార్యక్రమం బుధవారం రాత్రి సరూర్ నగర్ స్టేడియంలో 'మన నగరం' పేరుతో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. వీరే కాక.. నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ.. సబితా ఇంద్రారెడ్డి.. మల్లారెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు.. కార్పొరేటర్లు పాల్గొన్నారు.

తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గజం రూ.250 చొప్పున ఇంటి స్థలాల భూములు రిజిస్ట్రేషన్ ద్వారా క్రమబద్ధీకరించుకునే వీలుంది. 100 గజాల నుంచి వెయ్యి గజాల వరకు ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ జీవో కారణంగా నగరంలోని ఎల్ బీ నగర్.. రాజేంద్ర నగర్.. నాంపల్లి.. కార్వాన్.. జూబ్లీహిల్స్.. మేడ్చల్ వంటి ఆరు నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు మేలు జరుగుతుందని చెబుతున్నారు.

తాజా జీవోతో ఒక్క ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని 44 కాలనీలకు మేలు కలుగనుంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ అధికారిక ప్రకటన మునుగోడు ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ కు ఒక్క రోజు ముందుగా ప్రకటించటం.. వేడుకలా భారీ కార్యక్రమాన్ని నిర్వహించటం గమనార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.