Begin typing your search above and press return to search.

భారత్ బయోటెక్ కో ఫౌండర్ షేర్ చేసిన చిట్టి వీడియోతో కేసీఆర్ సర్కారు ఇమేజ్ డ్యామేజ్

By:  Tupaki Desk   |   23 July 2021 5:06 AM GMT
భారత్ బయోటెక్ కో ఫౌండర్ షేర్ చేసిన చిట్టి వీడియోతో కేసీఆర్ సర్కారు ఇమేజ్ డ్యామేజ్
X
నోరు తెరిస్తే చాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతలా తాము డెవలప్ చేశామన్న విషయాన్ని అలుపుసొలుపు లేకుండా చెబుతుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యమం గురించి చెప్పాల్సిన వచ్చినప్పుడు తాను చావు ముఖం వరకు వెళ్లి వచ్చిన దీక్ష గురించి గొప్పలుగా చెప్పే ఆయన.. 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానమే అప్పటి కేంద్ర సర్కారును.. సోనియమ్మను కదిలించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేలా చేసిందన్న మాట మాత్రం ఆయన నోటి నుంచి రాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత విద్యుత్ కొరతను అధిగమించిన వైనాన్ని గొప్పగా అభివర్ణిస్తూ.. తమ ప్రభుత్వం సాధించిన విజయాలంటూ గంటల కొద్దీ గొప్పలు చెబుతారు.

అసాధ్యమైన విద్యుత్ సమస్యను ఇట్టే తీర్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఖాళీ ఉద్యోగాల భర్తీ.. తెలంగాణ వ్యాప్తంగా కాకున్నా.. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగర రోడ్లు బాగుండేలా చేయటం.. గుంటలు లేకుండా చూసుకోవటంతో పాటు.. వర్షం పడినప్పుడు రోడ్ల మీద వర్షం నిలవకుండా ఎందుకు చూడలేకపోతున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. నిత్యం తన ప్రభుత్వ పాలన మీద ఆయన చెప్పే గొప్పలు.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ చెప్పే వరల్డ్ క్లాస్ మాటలకు భిన్నంగా వాస్తవ పరిస్థితి ఉందని తెలిసిందే.

ఇదే విషయాన్ని విపక్షాలు వేలెత్తి చూపితే.. పనికిమాలిన వాళ్లు.. చిల్లరగాళ్లు.. పని పాట లేని వాళ్లు అంటూ సింఫుల్ గా తేల్చేయటం గులాబీ నేతలకు తెలిసిందే. ఒకవేళ.. ఈ అంశాల్ని మీడియాలో వస్తే.. తెలంగాణ మీద క్రోధంతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ బుదర జల్లటం చేస్తుంటారు. అయితే.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కొవిడ్ కు చెక్ చెప్పేందుకు వీలుగా హైదరాబాద్ కు చెందిన ఫార్మా సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ తో ఒక్కసారిగా సామాన్యులకు సైతం సుపరిచితంగా మారింది భారత్ బయోటెక్. కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు ముందు చాలానే టీకాలు రూపొందించినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా భారత్ బయోటెక్ కు సరికొత్త గుర్తింపును తెచ్చి పెట్టింది.

ఆ కంపెనీకి చెందిన కో ఫౌండర్ సుచిత్ర ఎల్లా తాజగా పోస్టు చేసిన ఒక చిట్టి వీడియో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. హైదరాబాద్ ను విశ్వ నగరంగా అభివర్ణిస్తూ.. తాము చేస్తున్న డెవలప్ మెంట్ యాక్టివిటీస్ గురించి చెప్పే ప్రభుత్వాధినేతల మాటలకు భిన్నంగా వాస్తవ పరిస్థితి ఎలా ఉందో చూడాలన్న రీతిలో.. జీనోమ్ వ్యాలీ రోడ్ల పక్కన భారీగా నిలిచిన వాననీటిని చూపిస్తూ తీసిన వీడియోను ఆమె పోస్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి.. మంత్రి కేటీఆర్ వరకు పలువురికి వెళ్లేలా ఆమె ట్యాగ్ చేశారు.

ఈ చిట్టి వీడియోతో కొవాగ్జిన వ్యాక్సిన్ ఉత్పత్తి చేస సంస్థ ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్య ప్రపంచానికి తెలిసేలా చేసింది. కొవాగ్జిన్ లాంటి వ్యాక్సిన్ ను.. ఎలాంటి పరిస్థితుల మధ్య తయారు చేయాల్సి వస్తుందన్న వైనాన్ని కళ్లకు కట్టేలా తాజా వీడియో చూపిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు రోడ్లు.. మురుగునీటి పారుదల వ్యవస్థ మీద వస్తున్న విమర్శలన్నింటికి తలదన్నేలా చిట్టి వీడియో ఉందంటున్నారు. మరి.. ఈ వీడియోకు తెలంగాణ ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.