Begin typing your search above and press return to search.

ప్రాజెక్టుల ఎపిసోడ్ లో కేసీఆర్ సర్కారు ఇన్ని తప్పులు చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   23 Jan 2022 5:32 AM GMT
ప్రాజెక్టుల ఎపిసోడ్ లో కేసీఆర్ సర్కారు ఇన్ని తప్పులు చేస్తున్నారా?
X
నిత్యం నీతులు చెబుతూ.. వాళ్లు ఈ తప్పు చేస్తున్నారు. వీళ్లు ఈ తప్పు చేస్తున్నారంటూ వాదనలు వినిపించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన వరకు ఏం చేస్తున్నారన్న దానికి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. పక్కనున్న రాష్ట్రాల వారు తప్పులు చేస్తున్నారంటూ వేలెత్తి చూపించే వేళ.. తన వరకు తానేం చేస్తున్నారన్న విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా వ్యవహరించే తీరును తాజాగా బయట పెట్టింది కేంద్ర పర్యావరణ శాఖ బయటపెట్టింది.

ప్రాజెక్టుల నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు పొందకుండానే తెలంగాణ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టిందని.. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణం చేస్తున్నందున తెలంగాణ ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన వైనం తాజాగా బయటకు వచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ కు పర్యావరణ శాఖ అధికారి అరొకియా లెనిన్ ఇచ్చిన అఫిడవిట్ ద్వారా ఈ కొత్త విషయం వెల్లడైంది. తాము గుర్తించిన విషయాలకు సంబంధించిన అంశాల మీద గడువు లోపు స్పందించాలని.. లేని పక్షంలో ముందస్తు నోటీసులు లేకుండానే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం డిండి ప్రాజెక్టును 1.37 లక్షలహెక్టార్ల ఆయుకట్టను స్రష్టిస్తున్నట్లుగా తేలినట్లు పర్యావరణ శాఖ పేర్కొంది. నిబంధనల ప్రకారం 50 హెక్టార్లకు మించిన ఆయుకట్టును స్రష్టించే ప్రాజెక్టులకు కేంద్ర స్థాయిలో ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డిండి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల కోసం అసలు దరఖాస్తే చేయలేదని కేంద్రం తేల్చి చెప్పటం గమనార్హం. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ నుంచి 30 టీఎంసీల నీటిని 3.41 లక్షల ఎకరాలకు అందించటంతో పాటు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీటిని అందించటానికి వీలుగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది.

పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. డిండి ప్రాజెక్టులకు అపెక్సు కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని క్రిష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. గెజిట్ అమల్లోకి వచ్చిన ఆర్నెల్లలో వీటి డీపీఆర్ లు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే.. ఈ ప్రాజెక్టు డీపీఆర్ లను తమకు సమర్పించలేదని కేఆర్ఎంబీ వెల్లడించింది. మరి.. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.