Begin typing your search above and press return to search.

ఉద్యమంలోకి అడుగు పెట్టిన కేసీఆర్ మనమడు

By:  Tupaki Desk   |   14 Sep 2019 6:52 AM GMT
ఉద్యమంలోకి అడుగు పెట్టిన కేసీఆర్ మనమడు
X
నల్లమల అడవుల్ని నాశనం చేసి.. యురేనియం తవ్వకాలు చేపట్టాలంటూ తీసుకున్న నిర్ణయంపైన పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం కావటం తెలిసిందే. యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేపట్టిన సేవ్ నల్లమల ఉద్యమం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ అంశంపై సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ తమ వంతు గళం విప్పుతున్నారు.

నల్లమలను రక్షించాలని వారు సోషల్ మీడియాలో నినాదాల్ని పోస్ట్ చేస్తున్నారు. తమ అభిప్రాయాల్ని పంచుకోవటమే కాదు.. సేవ్ నల్లమలలో భాగంగా ఛేంజ్ ఓఆర్జీ ఆన్ లైన్ పిటిషన్ లో సంతకాలు చేసి తమ మద్దతును ఓపెన్ గా చెప్పేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. నల్లమలలో యురేనియం తవ్వకాలపై సీఎం హోదాలో ఇప్పటివరకూ పెదవి విప్పని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు భిన్నంగా ఆయన ముద్దుల మనమడు యురేనియం తవ్వకాల నిర్ణయంపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. సేవ్ నల్లమల అంటూ పోస్టులను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి.. ఈ అంశాన్ని షేర్ చేయాల్సిందిగా కోరారు. ఉద్యమ అధినేత మనమడు చిన్న వయసులోనే సేవ్ నల్లమల ఉద్యమంలోకి రావటం పలువురిని ఆకట్టుకుంటోంది.

సేవ్ నల్లమల పేరుతో సాగుతున్న ఆన్ లైన్ ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న కేసీఆర్ మనమడు హిమాన్ష్ రియాక్ట్ కావటంపై పలువురు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. తన కుమారుడు రియాక్ట్ అయి.. ఉద్యమ గోదాలోకి దిగి.. తన గొంతు విప్పిన అనంతరం.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం నల్లమల అడవిని రక్షించుకోవటంపై తాను సీఎంతో వ్యక్తిగతంగా మాట్లాడతానని ట్వీట్ చేయటం గమనార్హం.

మరోవైపు సేవ్ నల్లమల ఉద్యమానికి భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ ఇష్యూ మీద జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటు.. యూత్ స్టార్ విజయ్ దేవరకొండ.. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల.. రాహుల్ రామకృష్ణ.. దర్శకుడు సురేందర్ రెడ్డిలు తమ వ్యతిరేకతను తెలియజేశారు. తాజాగా అడివి శేష్.. సమంత.. మంచు మనోజ్.. రామ్.. వరుణ్ తేజ్.. సాయి తేజ్.. అనసూయ తదితరులు సేవ్ నల్లమల అంటూ సోషల్ మీడియాలో నినదిస్తున్నారు.

నల్లమలను కాపాడేందుకు హీరోలు జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్ లు ముందుకు రావాలంటూ దర్శకుడు పూరీ జగన్నాధ్ కోరారు. సేవ్ నల్లమలపై ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రచారం చేయటం మొదలు పెట్టటంతో సేవ్ నల్లమల హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ మారింది. ఒక్క శుక్రవారం 45వేల ట్వీట్లతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. స్టాప్ యురేనియం మైనింగ్ అనే మరో హ్యాష్ ట్యాగ్ 15వేల పోస్టులతో పదో స్థానంలో నిలిచింది. తన ముద్దుల మనమడితో పాటు.. ఇంతమంది ప్రముఖులు రియాక్ట్ అవుతున్న వేళ..ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తకిరంగా మారింది.