Begin typing your search above and press return to search.

ఏడేళ్ల తర్వాత కూడా ‘మహా’పై క్లారిటీ లేకపోవటమా కేటీఆర్?

By:  Tupaki Desk   |   8 Sep 2021 4:06 AM GMT
ఏడేళ్ల తర్వాత కూడా ‘మహా’పై  క్లారిటీ లేకపోవటమా కేటీఆర్?
X
తెలంగాణ రాష్ట్ర సమితి.. సింఫుల్ గా చెప్పాలంటే టీఆర్ఎస్ గా సుపరిచితమైన తెలంగాణ అధికారపక్షం తీరు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ పార్టీకి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. ఇవి సరిపోనట్లు.. దక్షిణాదిన చాలా తక్కువ పార్టీలకు మాత్రమే ఉన్న పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు ఇటీవల శంకుస్థాపన చేయటం తెలిసిందే. అలాంటి ఈ పార్టీకి హైదరాబాద్ మహానగరంలో మాత్రం జిల్లా పార్టీ కార్యాలయం లేకపోవటం గమనార్హం.

తెలంగాణ భవన్.. టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయం మాత్రమే. హైదరాబాద్ జిల్లా వరకు ప్రత్యేకించి పార్టీ కార్యాలయం అంటూ ఏమీ లేదు. అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినప్పటికి హైదరాబాద్ జిల్లా పార్టీకి కానీ.. హైదరాబాద్ మహానగరానికి పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి ఉన్నప్పటికీ.. యాక్టివ్ గా మాత్రం లేదు. తాజాగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాటల్ని వింటే ఆసక్తికరంగానూ.. ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తాయి.

పార్టీకి హైదరాబాద్ మహానగరం కంచుకోటగా అభివర్ణించే ఆయన.. ఏడేళ్లకు కూడా పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు ఎందుకు చేయలేదనే వాదనకు సరైన కారణం చెప్పలేకపోవటం గమనార్హం. అంతేకాదు.. హైదరాబాద్ జిల్లా వరకు ప్రత్యేకంగా పార్టీ కమిటీని ఏర్పాటు చేయాలా? లేదంటే.. హైదరాబాద్.. రంగారెడ్డి.. మల్కాజిగిరి కలిపి మహానగర పార్టీ కమిటీని ఏర్పాటు చేయాలా? అన్న దానిపై క్లారిటీ లేదు. విడివిడిగా పార్టీ కమిటీలు ఉండాలా? లేదంటే మహానగరానికి మొత్తంగా ఒకే కమిటీని ఏర్పాటు చేయాలా? అన్న దానిపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

హైదరాబాద్ మహానగరానికి వచ్చేసరికి.. మిగిలిన నగరాలకు కాస్త భిన్నంగా ఉంటుంది. పేరుకు హైదరాబాద్ మహానగరమే కానీ.. అందులో మూడు జిల్లాలు కలుపుకొని ఉంటాయి. ఉదాహరణకు ఉప్పల్.. మల్కాజిగిరి.. కుత్భుల్లాపూర్ నియోజకవర్గాలు మల్కాజిగిరి జిల్లాల్లోకి వస్తే.. కూకట్ పల్లి.. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తాయి. హైదరాబాద్ జిల్లా వరకు వస్తే.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగులేని అధిక్యత మజ్లిస్ దే. ఇలంటివేళలో.. హైదరాబాద్ జిల్లా వరకు పార్టీ కమిటీ బలహీనంగా ఉండటం ఖాయం. దీనికి బదులుగా మహానగర పార్టీ కమిటీని ఏర్పాటు చేయటమే ఉత్తమం. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవటానికి కేసీఆర్ లాంటి మాస్టర్ మైండ్ కు ఏడేళ్లు దాటినా ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవటం ఏమిటో?