Begin typing your search above and press return to search.

కేసీఆర్ ల‌క్కంటే ల‌క్కే

By:  Tupaki Desk   |   26 July 2016 9:32 AM GMT
కేసీఆర్ ల‌క్కంటే ల‌క్కే
X
మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు వివాదంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌ రావుకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తీపిక‌బురు అందింది. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌డ‌మే ఆ గుడ్ న్యూస్ కావ‌చ్చు అనుకుంటున్నారా? ఆ ప‌ర్య‌ట‌న శుభ‌ప‌రిణామమే కానీ అంత‌కంటే ముందే కేసీఆర్ మ‌రికొన్ని సంతోష‌క‌ర వార్త‌లు విన్నార‌ని స‌మాచారం.

ఇటీవ‌లే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌ తో స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అనేక తీపిక‌బుర్ల‌ను అందించిన‌ట్లు స‌మాచారం. అంతరాష్ట్ర భద్రతా మండలి సమావేశానికి హాజరైన సందర్భంలో ఢిల్లీలో ప్రధాని మోడీతో జరిపిన భేటీ ఫలితాలిచ్చింద‌నేది ఈ చ‌ర్చ‌ల సారాంశం. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ప్రధానమైన అంశాలలో దాదాపు అన్నింటిపైనా కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు జైట్లీ కేసీఆర్‌ కు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీకాలం పెంపు - ద్రవ్య పరిపతి యాజమాన్య నిర్వహణ (ఎఫ్‌ ఆర్‌ బిఎం) పెంపు - కేసీఆర్‌ కు అత్యంత ఇష్ట‌మైన ప‌థ‌కాలైన మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం - మిషన్ భగీరథకు కేంద్రం పూచికత్తువంటి అన్ని అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్టుగా చెప్పారు.

మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఎఫ్‌ ఆర్‌ బిఎం పరిమితి పెంపు వర్తిస్తుంది. దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలు గుజరాత్ - తెలంగాణ మాత్రమే. ఎఫ్‌ ఆర్‌ బీఎం పరిమితి ఏమేరకు పెంచాలో కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయాన్నీ సీఎం కేసీఆర్‌ కు వివరించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ రెండు రాష్ట్రాలకు ఎఫ్‌ ఆర్‌ బిఎం 3.5 శాతం పెంచాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ఈ సిఫారసును గతవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి ఆమోదించడంతో ఎంతోకాలంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ ఫలించినట్టయ్యింది. ఎఫ్‌ ఆర్‌ బిఎం పరపతి పెంచడంతో రాష్ట్రం ఏటా అదనంగా రూ.3 వేల కోట్ల ఆర్థిక సాయం పొందేందుకు వెసులుబాటు లభించనుంది. రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన పెండింగ్ అంశాల్లో ఎఫ్‌ ఆర్‌ బిఎం పరిమితి పెంపు ఒకటి. కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దమొత్తంలో నిధులు (ఏటా రూ.25 వేల కోట్లు) కేటాయించడంతో పాటు మిషన్ కాకతీయ - మిషన్ భగీరథ పథకాలకు 30నుంచి 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని - వీటివల్ల తమపై పడిన ఆర్థిక భారాన్ని కొంతలో కొంత తగ్గించుకోవడానికి ఎఫ్‌ ఆర్‌ బిఎం దోహదపడుతుందని ప్రధాని మోదీకి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. మిషన్ కాకతీయకు కేంద్ర సాయం అందించడంతో పాటు - మిషన్ భగీరథ పథకానికి కేంద్రం పూచికత్తుతో రుణం పొందడానికి అవకాశం కల్పించారు. ఈ అంశాన్ని వచ్చే నెల మొదటివారంలో (ఆగస్టు 7) రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించనున్నారని తెలిసింది.

ఇదిలాఉండ‌గా ప్రధాన మంత్రితో సీఎం కేసీఆర్ భేటీ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లిన అంశాలలో హైకోర్టు విభజన ఒక్కటి పెండింగ్‌ లో ప‌డింది. ఈ విష‌యం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంవల్ల - ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేమని - మిగిలిన అంశాలు అన్నింటిపైనా కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు అందినట్టు అధికార వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నట్టు సమాచారం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్భంలో కేంద్రం నిర్ణయాలను తెలియజేసినట్టు సమాచారం.