Begin typing your search above and press return to search.

కోర్టు లెక్క కోర్టుల‌దే.. సారు లెక్క సారుదే!

By:  Tupaki Desk   |   29 July 2019 5:56 AM GMT
కోర్టు లెక్క కోర్టుల‌దే.. సారు లెక్క సారుదే!
X
తాను న‌మ్మిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా ఉందంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే. త‌న‌కున్న న‌మ్మ‌కాల‌కు అనుగుణంగా సెక్ర‌టేరియ‌ట్ వాస్తు బాగోలేని నేప‌థ్యంలో దాన్ని కూల‌గొట్టి.. దాని స్థానే స‌రికొత్త స‌చివాల‌యాన్ని క‌ట్టాల‌ని ఫిక్స్ అయ్యారు గులాబీ బాస్.

తాను త‌యారు చేస్తున్న బంగారు తెలంగాణ‌లో పాత డొక్కు అసెంబ్లీ భ‌వ‌నం అయితే ఏం బాగుంటుంద‌ని ఫీలైన కేసీఆర్ దాని స్థానే చారిత్ర‌క క‌ట్ట‌డం(తెలంగాణ స‌ర్కారు దృష్టిలో మాత్రం కాద‌నుకోండి) ఎర్ర‌మంజిల్ భ‌వ‌నాన్ని కూల్చేసి.. అక్క‌డ భారీ ఎత్తున అసెంబ్లీ భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని డిసైడ్ కావ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ రెండు నిర్మాణాల‌పై విప‌క్షాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. మ‌రో వందేళ్లు ఉండే భ‌వ‌నాల్ని కూల‌దోసి కొత్త భ‌వ‌నాల్ని నిర్మించాల్సిన అవ‌స‌రం ఏమిట‌న్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. ఇక‌.. ప్ర‌జ‌ల్లోనూ ఈ రెండు కొత్త భ‌వ‌నాల అవ‌స‌రం లేద‌న్న మాట వినిపిస్తోంది.

అయితే.. తాను కోరుకున్న‌ట్లుగా తాను ఉండే స‌చివాల‌యం.. అసెంబ్లీలు ఉండాల‌ని క‌ల‌లు కంటున్న కేసీఆర్‌.. ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. త‌మ మాట‌ల్ని ఎంత‌కూ విన‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం మీద కోర్టులో కేసులు వేశారు. దీనిపై విచార‌ణ జోరుగా సాగుతోంది.

స‌చివాల‌య నిర్మాణం విష‌యాన్ని కాసేపు ప‌క్క‌న పెడితే.. అసెంబ్లీ నిర్మాణంపై హైకోర్టు ఇప్ప‌టికే ప‌లుమార్లు బొప్పి క‌ట్టేలా సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేసింది. ఇప్పుడు జ‌రుగుతున్న విచార‌ణ తీరు చూస్తే.. కొత్త‌ అసెంబ్లీ నిర్మాణంపై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కోర్టు క‌స్సుబుస్సుల్ని కేసీఆర్ అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నంగా సెల‌వురోజైన ఆదివారం వేల‌.. అధికారుల్ని పిలిపించుకున్న కేసీఆర్‌.. వారితో భేటీ అయిన‌ట్లుగా చెబుతున్నారు. స‌చివాల‌యానికి సంబంధించిన కొత్త డిజైన్ల‌ను ఆయ‌న ప‌రిశీలించిన‌ట్లుగా తెలుస్తోంది. స‌చివాల‌యం త‌ర‌లింపు అంశాన్ని స‌మీక్షించిన ఆయ‌న‌.. అందుకు జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను అడిగి తెలిసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. త‌న డ్రీం ప్రాజెక్టుల్లో ఒక‌టైన అసెంబ్లీలోని ప‌లు శాఖ‌ల్ని సైతం త‌ర‌లించాల‌న్న ఆదేశాల్ని కూడా ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. కేసీఆర్ తీరు చూస్తే. . కోర్టు దారి కోర్టుదే.. త‌న దారి త‌న‌దే అన్న‌ట్లుగా ఆయ‌న వైఖ‌రి ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.