Begin typing your search above and press return to search.

గులాబీ ఎన్నికల గుభాళింపు

By:  Tupaki Desk   |   22 Aug 2018 5:05 AM GMT
గులాబీ ఎన్నికల గుభాళింపు
X
తెలంగాణ రాష్ట్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇందుకు సంకేతంగా ముఖ్యమంత్రి - తెలంగాణ రాష్ట్ర సమతి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా హఠాత్తుగా రాష్ట్ర మంత్రివర్గాన్ని బుధవారం నాడు సమావేశ పరుస్తున్నారు. ఇది ముందుగా నిర్ణయించిన సమావేశం కాదు. అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన సమావేశం. అంతే కాదు. ఇది తెలంగాణలో జరుగుతున్న వివిధ పనులు - జరగాల్సిన పనులపై నిర్వహించే సమావేశం కూడా కాదు. ఫక్తు రాజకీయ నిర్ణయాల మంత్రివర్గ సమావేశం. ఎన్నికలకు సమరశంఖం పూయించిన ముఖ్యమంత్రి ఆ దిశగా చకచకా పావులు కదుపుతున్నారు. ఆయనే కాదు... మంత్రివర్గ సహచరులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ముందు ముందు ఎలా ఉంటుందో... ఏమి జరుగుతుందో.... ఎంత వేగం పెరుగుతుందో తెలంగాణ వాసులకు చెప్పేందుకే ముఖ్యమంత్రి ఈ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి తెలంగాణలో మంత్రివర్గ సమావేశాలపై ముఖ్యమంత్రికి అంత శ్రద్ధ ఉండదు. ఎందుకంటే అన్నీ తానే అయిన పార్టీలో - ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కల్వకుంట్ల వారిదే. ఫలానా నిర్ణయం తీసుకున్నాం... అమలు చేయండి... లోపాలు లేకుండా చూసుకోండి అని చెప్పడానికే మంత్రివర్గ సమావేశాలు ఉంటాయి. ఈ మాత్రం దానికి నెలకో - రెండు నెలలకో ఒకసారి భేటీ కావడం శుద్ధ దండగ అని ముఖ్యమంత్రి అభిప్రాయం. ఇందుకు అనుగుణంగానే నెలల తరబడి తెలంగాణలో మంత్రివర్గ సమావేశాలు జరిగిన దాఖలాలు కూడా లేవు. అయితే ఈ సారి మాత్రం పది రోజుల క్రితమే రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయ్యింది. అంతే మళ్లీ ఇదిగో బుధవారం నాడు మళ్లీ కలుస్తోంది.

మంత్రులందరూ విధిగా హాజరుకావాలని కూడా ముఖ్యమంత్రి హుకుం జారీ చేశారు. మంత్రి వర్గ సమావేశంలో ఏం చర్చలు జరుగుతాయి... ఏ మంత్రులు ఏ అంశాలపై సిద్ధంగా ఉండాలో రెండు - మూడు రోజుల ముందే చెప్తారు. అందుకు అనుగుణంగానే వారి సిద్ధం అవుతారు. అయితే బుధవారం సాయంత్రం జరిగే సమావేశంలో మాత్రం ఎలాంటి ఎజెండా లేదు. మంత్రులకు ఎలాంటి సమాచారం లేదు. మంత్రివర్గ సమావేశం ఉంది. సిద్ధంగా ఉండండి. విధిగా హాజరుకండి. ముక్తసరిగా ఇవే మాటలు సిఎం కార్యాలయం నుంచి వచ్చాయి. అంటే ముందస్తు ఎన్నికలపై వ్యూహ ప్రతివ్యూహాలు రచించేందుకే ఈ మంత్రి వర్గ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అత్యవసర క్యాబినెట్ భేటీపై ముందస్తుగా సమాచారం లేకపోవడంతో కొందరు మంత్రులు తమ నియోజకవర్గాలకు వెళ్లారు. బుధవారం నాడు బక్రీద్ కావడంతో వారి వారి నియోజకవర్గాల్లో ముస్లీములకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లారు. వారంతా తిరిగి హైదరాబాద్ ప్రయాణం కట్టాల్సిన పరిస్థితి. క్యాబినెట్ సమావేశం బుధవారం సాయంత్రం కావడం మంత్రులకు కొంత ఊరట. అదే ఉదయం పూట అయితే వారు ఎవ్వరినీ కలిసే అవకాశం లేకుండా రాజధానికి రావాల్సి ఉండేది. ఈ మంత్రివర్గ సమావేశంలో శాసనసభ రద్దుపై చర్చిస్తారా... ముందస్తుకు ఎప్పుడు వెళ్లాలో నిర్ణయిస్తారా.... లేక ఉద్యోగులను ప్రసన్నం చేసుకుందుకు వారికి ఎన్నాళ్ల నుంచో బకాయి పడ్డ మధ్యంతర భ్రతిపై చర్చిస్తారా అన్నది సాయంత్రం వరకూ సస్పెన్స్.